logo

*అరగంటకు మించి సోషల్ మీడియా వాడితే పిల్లలకు డేంజర్.. తాజా అధ్యయనంలో ఆందోళనకర విషయాలు..!!


రోజుకు అరగంటకు మించి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై గడిపే పిల్లల్లో క్రమంగా ఏకాగ్రత తగ్గుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 8,000 మందికి పైగా చిన్నారులపై నాలుగేళ్లపాటు నిర్వహించిన ఈ పరిశోధనలో ఆందోళనకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

స్వీడన్‌కు చెందిన కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, అమెరికాలోని ఒరెగాన్ హెల్త్ & సైన్స్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు. 9 నుంచి 14 సంవత్సరాల వయసున్న 8,324 మంది పిల్లల స్క్రీన్ అలవాట్లను వీరు పరిశీలించారు. అధ్యయనం ప్రకారం, 9 ఏళ్ల వయసులో సగటున 30 నిమిషాలుగా ఉన్న సోషల్ మీడియా వాడకం, 13 ఏళ్లు వచ్చేసరికి రోజుకు 2.5 గంటలకు పెరిగింది. అనేక ప్లాట్‌ఫామ్‌లు 13 ఏళ్ల వయసును కనీస అర్హతగా నిర్దేశించినప్పటికీ, వాడకం అంతకంటే ముందే మొదలవుతున్నట్లు తేలింది.

పరిశోధన బృందానికి చెందిన ప్రొఫెసర్ టోర్కెల్ క్లింగ్‌బర్గ్ మాట్లాడుతూ.. "సోషల్ మీడియాలో నిరంతరం వచ్చే సందేశాలు, నోటిఫికేషన్లు పిల్లల దృష్టిని మరల్చుతాయి. ఏదైనా మెసేజ్ వచ్చిందేమోనన్న ఆలోచన కూడా వారి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. ఇదే ఈ సమస్యకు ప్రధాన కారణం" అని వివరించారు. పిల్లల సామాజిక, ఆర్థిక నేపథ్యం లేదా వారికి జన్యుపరంగా ఏడీహెచ్‌డీ లక్షణాలు ఉన్నాయా..? అనే దానితో సంబంధం లేకుండా ఈ ప్రభావం కనిపిస్తోందని తెలిపారు..!!

0
286 views