logo

ఇండియా కూటమిని ఏకం చేస్తాం

ఇండియా కూటమిని ఏకం చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు.
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి ఓటమిపాలైనప్పటికీ తమ పార్టీకి కాంగ్రె్‌సతో సంబంధాలు కొనసాగుతాయన్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరిగిన 'విజన్‌ ఇండియా ఏఐ సమ్మిట్‌'కు అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూపీ ఎన్నికల జాబితాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎ్‌సఐఆర్‌) కోసం ఉపయోగిస్తున్న మ్యాపింగ్‌ యాప్‌తో ఓట్లను బీజేపీ తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి విరాళాలు ఇచ్చిన కంపెనీ అభివృద్ధి చేసిన యాప్‌ అది అని అన్నారు. యూపీలో 25 కోట్ల జనాభా ఉందని, కొత్త యాప్‌తో 3 కోట్ల మంది ఓటర్లను తొలగించే ప్రమాదానికి దారితీస్తుందని చెప్పారు. బీజేపీ ఓడిపోయిన ప్రాంతాల్లో ఓట్లను తొలగించే అలవాటు చేసుకుందని అఖిలేశ్‌ ఆరోపించారు. ఎస్‌ఐఆర్‌తో బీజేపీ 2027 యూపీ ఎన్నికల్లో గెలవాలని కోరుకుంటోందని అఖిలేశ్‌ ఆరోపించారు. ఆధార్‌ను ఓటరు జాబితాతో ఎందుకు అనుసంధానం చేయడంలేదని ప్రశ్నించారు. యూపీలో ఎస్పీ అధికారంలోకి వస్తే.. ప్రజా ప్రయోజనాలకోసం ఏఐని ఉపయోగిస్తామన్నారు.

అందరూ స్నేహితులే..

అందరితో తమ పార్టీ స్నేహం కొనసాగుతుందని అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలతో సమావేశాలపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ.. స్నేహంలో అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయన్నారు. బీఆర్‌ఎ్‌సతో ముందు నుంచి తమకు స్నేహం ఉందని, కొత్త స్నేహితులు వచ్చారని పాత వారిని వదులుకోలేం కదా అని అన్నారు.

అఖిలేశ్‌తో బీసీ సంఘాల నేతల భేటీ..

అఖిలేశ్‌ యాదవ్‌తో బీసీ సంఘాల నేతలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని లేవనెత్తాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. బీసీ జేఏసీ వర్కింగ్‌ చైర్మన్‌ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కుందారం గణేష్‌ చారి, తదితరులతో కలిసి అఖిలేశ్‌ను బీసీ జేఏసీ చైర్మన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ కలిశారు. రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా కేంద్రంపై పోరాటం చేయాలని జాజుల.. అఖిలేశ్‌ను కోరారు. ఈమేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లో ఆమోదించేలా ఎస్పీ తరఫున పార్లమెంట్‌లో పోరాటం చేయాలన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ అసెంబ్లీలో చేసిన చట్టాన్ని కేంద్రం ఆమోదించడంలేదని ఈ సందర్భంగా అఖిలేశ్‌ దృష్టికి తెచ్చారు. రిజర్వేషన్ల పెంపునకు దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని అఖిలేశ్‌ను జాజుల కోరారు. బీసీల న్యాయసమ్మతమైన డిమాండ్‌ను సాధించేందుకు పార్లమెంట్‌లో మాట్లాడుతానని అఖిలేశ్‌ యాదవ్‌ హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. బీసీ ఉద్యమంలో ఎస్పీ సైతం భాగస్వామ్యమవుతుందని బీసీ జేఏసీ ప్రతినిధులకు అఖిలేశ్‌ హామీ ఇచ్చారు.

రామేశ్వరం కెఫేలో అఖిలేశ్‌, కేటీఆర్‌ లంచ్‌

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శనివారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని రామేశ్వరం కెఫేలో లంచ్‌ చేశారు. ఈ కెఫేలో రుచుల గురించి, ప్రత్యేకమైన టిఫిన్స్‌ గురించి తెలుసుకున్న అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తి మేరకు కేటీఆర్‌ అక్కడ మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. ఇద్దరు నేతలు రుచులను ఆస్వాదిస్తూ పలు రాజకీయ, సమకాలీన అంశాలపై కాసేపు ముచ్చటించారు. అంతకుముందు కేటీఆర్‌ మధ్నాహ్నం 3 గంటలకే హోటల్‌కు రాగా 3.35 గంటలకు అఖిలేశ్‌ యాదవ్‌ వచ్చారు. లంచ్‌ తర్వాత ఇద్దరు నేతలు కలిసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ నివాసానికి వెళ్లారు.

5
70 views