logo

*విద్యార్ధినులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి ఉండాలి* *- విజయనగరం మహిళా పోలీసు స్టేషను ఇన్స్పెక్టరు ఈ.నర్సింహమూర్తి*


"చిన్న అమ్మాయి" ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది విజయనగరం జిల్లా పరిషత్ (కస్పా) ఉన్నత పాఠశాల విద్యార్ధినులు తే.13.12.2025దిన విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్ను సందర్శించారు. *విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,ఐపిఎస్* గారి ఆదేశాలమేరకు మహిళా పోలీసు స్టేషను ఇన్స్పెక్టరు ఈ.నర్సింహమూర్తి విద్యార్ధినులతో మమేకమై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా మహిళా పోలీసు స్టేషను ఇన్స్పెక్టరు ఈ.నర్సింహమూర్తి మాట్లాడుతూ - మంచి భవిష్యత్తును నిర్ణయించేది చదువేనన్న విషయాన్ని విద్యార్థులు ముందుగా గుర్తించాలన్నారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి, ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. తెలిసీ తెలియని వయస్సు లో ప్రలోభాలకు లొంగడం, ఆకర్షణలకు లోనుకావడం, సోషల్ మీడియాకు అలవాటు పడడం వలన భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. విద్యార్ధినులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కలిగి వుండాలని, తల్లితండ్రులు, తోబుట్టువులను తప్ప వేరే వాళ్ళను నమ్మి వారి మాయ మాటలకు మోసపోకూడదన్నారు. మైనరు విద్యార్థులు అవగాహన లేని కారణంగా లైంగిక వేధింపులకు గురవుతున్నారని, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన ఉంటే మోసగాళ్ళు చెప్పే మాయ మాటలు వినకుండా ఉంటారన్నారు. లైంగిక దాడులను నుండి బాలికలను కాపాడేందుకు విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారికి శిక్ష పడే విధంగా వ్యవహరిస్తున్నామన్నారు. అమ్మాయిలకు ఎక్కడైనా, ఏమైనా ఇబ్బందులు తలెత్తినా, ఈవ్ టీజింగు గురైనా డయల్ 100 లేదా 112కు ఫోను చేయాలన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు మీరున్న ప్రాంతానికి చేరుకొని, సహాయపడతారన్నారు. అనంతరం పోక్సో చట్టం, మరియు కొత్త చట్టాల పట్ల అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మహిళా పిఎస్ ఎస్ఐ శిరీష,సిబ్బంది. శక్తి టీమ్స్,"చిన్న అమ్మాయి" ఫౌండేషన్ సభ్యులు, జిల్లా పరిషత్ (కస్పా) ఉన్నత పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు.

23
23 views