
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్* ప్రపంచ మానవహక్కుల దినోత్సవ అవగాహన కార్యక్రమము*......
తేదీ: 10-12-2025* శేరిలింగంపల్లి, చందానగర్ :ఈరోజు ఉదయము BHEL టౌన్ షిప్ లో గల శేరిలింగంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలనందు విద్యార్థిని, విద్యార్థులకు మానవహక్కుల దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ G రవీందర్ గారు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా విచ్చేసిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, గచ్చిబౌలి రాజనీతిశాస్త్ర విభాగపు అధిపతియైన ఆచార్య నాగేశ్వరరావుగారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ " *మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించి అంతర్జాతీయ ఒడంబడికలపై అవగాహన కల్పించడానికి డిసెంబరు 10వ తేదీన ఒక అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరము నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం ' _మానవహక్కులు - మన దైనందిన అవసరాలు'_ అనే నినాదంతో నిర్వహిస్తుంది* " అని అన్నారు. " *హక్కులనేవి రెండు విధాలుగా ఉంటాయి.*
*1. జన్మతః లభించేది: జీవించే హక్కు.*
*2. రాజ్యాంగ పరంగా లభించే హక్కులు.*
*భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రగా జీవించేందుకు కొన్ని హక్కులు ఉంటాయి. కానీ అనేక సందర్భాలలో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని కనీసం మనిషిగా కూడా చూడటం లేదు. కొన్ని సందర్భాలలో సమాజం కూడా ఈ హక్కులను హరించి వేస్తుంది. పరువుహత్య, జాతి వివక్ష హత్య, అత్యాచార ఘటనల వంటివి మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. కొంతమందిలో ఇంకా జాతి, భాష, ప్రాంత, లింగ, కుల.మత విభేదాల జాడ్యం వీడలేదు. వీటివలననే మానవ విలువలు నానాటికి అడుగంటి పోతున్నాయి. ఈమధ్య కాలంలో బీద, ధనికులనే ఆర్థిక అసమానతల వలన క్రిందిస్థాయి వారిని కించపరచడం జరుగుతూవుంది. హక్కులు లేని జీవితం వ్యర్థము. మానవుడు స్వతంత్రంగా జీవించి తన మనుగడను సాగించడానికి ఈ హక్కులు ఉతమిస్తాయి. హక్కులు లేని మనిషి బనిసతో సమానము"* అని అన్నారు.
*మానవహక్కుల ప్రధాన లక్ష్యాలు:*
*1. జాతి, వర్ణ, లింగ, కుల-మత, రాజకీయ మరియు యితర కారణాలతో వివక్షకు లోను కాకుండా జీవనం గడపాలి*
*2. చిత్రహింసలు, క్రూరత్వం నుండి బయటపడటం* .
*3. వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచారాలనుండి రక్షణ పొందడం.*
*4. నిర్బంధం లేని జీవన విధానం కలిగి ఉండాలి.*
*5. స్వేచ్ఛగా స్వదేశం, విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి.*
*6. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి.*
*7. సురక్షిత ప్రాంతాలలో జీవించే హక్కు ఉండాలి.*
*8. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి.*
*9. భావ ప్రకటన స్వాతంత్ర్యపు హక్కు ఉండాలి.*
*10. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి.*
*1993లో మానవహక్కుల అభివృద్ధి, పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఒక హై కమీషన్ ను నియమించింది. భారత ప్రభుత్వంకూడా అక్టోబరు 12వ తేదీన హక్కుల పరిరక్షణకై మానవహక్కుల కమీషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమీషన్ చట్ట బద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఈ కమీషన్ రాజ్యాంగ బద్ధంగా, చట్ట బద్ధంగా ప్రజలకు కల్పించిన హక్కుల రక్షణకై బాధ్యతను చేపడుతుంది. ఈ కమీషన్ లో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. ఛైర్మన్ గా సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి యై ఉండాలి. ఒక సభ్యునిగా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన వారై ఉండాలి. మరొక సభ్యుడు ఏదైనా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్న లేదా పదవీవిరమణ చేసిన వారై ఉండాలి. మిగిలిన యిద్దరు సభ్యులు మానవ హక్కుల రంగంలో పరిజ్ఞానం ఉన్నవారై ఉండాలి. పై సభ్యులతో పాటు మరో నలుగురు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు. జాతీయ మానవహక్కుల కమీషన్ ఛైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు. వీరి నియామకంలో ప్రధానమంత్రి అధ్యక్షతన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, లోక్ సభ స్పీకర్, రాజ్యసభ, లోక్ సభలలోని ప్రతిపక్ష నాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రితో కూడిన కమిటీ సలహా యిస్తుంది. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు లేదా 70 సంవత్సరములు వయసు వచ్చే వరకు ఏది ముందయితే అది వర్తిస్తుంది. అవసరమైన సందర్భంలో వీరిని తొలగించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. ఇదే విధంగా రాష్ట్రాలలో కూడా కమీషన్ ఏర్పడుతుంది. వీరిని రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. జాతీయ మానవహక్కుల కమీషన్ యొక్క నియమాలన్నీ వీరికి కూడా వర్తిస్తాయి.*
*మానవహక్కుల కమీషన్ విధులు:*
*1. మానవహక్కులను పరిరక్షించడం.*
*2. కారాగారంలో ఉన్న ఖైదీలకు కనీస సౌకర్యాలు కల్పించే విషయాలపై మార్గదర్శకాలు ఇవ్వడం.*
*3. మానవహక్కుల రంగంలో పరిశోధనలు చేపట్టడం లాంటివి"* అని అన్నారు.
" *మానవహక్కుల పరిరక్షణకు సంబంధిత కమీషన్ బాధ్యత వహిస్తుంది. ప్రతి ఒక్కరూ మానవహక్కులపై అవగాహన కలిగి ఉండాలి. మానవహక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో కృషి చేయాలి. పౌర సమాజం కూడా చురుకైన పాత్రను పోషించాలి"* అని తెలిపారు. " *మానవహక్కుల ఉద్యమంలో అనేక ప్రభుత్వేతర సంస్థలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిలో ఒకటి అమ్నెస్టీ ఇంటర్నేషనల్. రెండు హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రముఖమైనవి* " అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆచార్య సోమరాజు S V యూనివర్సిటీ తిరుపతి, అధ్యాపకులు మహమ్మద్ యూనస్, సయ్యద్ మక్సూద్, విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, జనార్ధన్, పాలం శ్రీను, ప్రేమ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.