logo

రసవత్తరంగా సాగిన "స్వర బృందావనం" 27 వ సినీ సంగీత విభావరి.

6.12.2025 తేదీన సిటీ కల్చరల్ స్టూడియో హైదరాబాదు నందు "మ్యాజిక్ బ్యానర్" "స్వర బృందావనం" 27 వ సినీ సంగీత విభావరి చాలా అద్భుతంగా, రసవత్తరంగా సాగి ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకుల నందరినీ అలరించింది. తక్కువమందితో చిన్నగా చేయాలనుకున్న ప్రోగ్రామ్ "స్వర బృందావనం" అభిమాన గాయనీ గాయకులు మరికొంతమంది చేరుటతో పెద్దదైనది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్విరామంగా సాగి, ప్రత్యేకంగా నిర్వహించిన నిర్వాహకుడు రవికాంత్ ను, సహ నిర్వాహకుడు శ్రీకుమార్ ను పలువురు ప్రశంసించారు. అర్థవంతమైన, సందేశాత్మకమైన, ప్రత్యేకత కలిగిన పాత కొత్త పాటలను గాయనీ గాయకులు ఎంచుకొని తెలుగు హిందీ భాష లలో పాడి ప్రేక్షకులను అలరింపజేశారు.
ఉదయం 10 గంటలకు రవికాంత్ వినాయక ప్రార్థన తో కార్యక్రమం మొదలైంది. పిమ్మట శ్రీకుమార్ బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటూ ఈశ్వర ప్రార్థన, సీతాకుమారి జననీ శివకామినీ అంటూ లలితా భట్టారికా స్తుతి, అనంతరం రవికాంత్ ఒక కొత్తదైన, ప్రత్యేకమైన, ప్రైవేట్ సాంగ్ రఘుకుల తిలకా రారా అంటూ సాగిన బాల రామ ప్రార్థన, రమాదేవి నీవుండే దాకొండపై అంటూ ఏడుకొండలవాని స్తుతి అత్యద్భుతంగా ప్రేక్షకుల నానందింపజేశాయి. గోదావరిఖని నుండి వచ్చిన శ్రీనివాస్ స్త్రీ పురుష కంఠస్వరాలతో అలవోకగా పాడిన పాటలు ప్రేక్షకుల ను ఆనందింపజేయడంతో పాటు అతనికి "సవ్యసాచి" అనే బిరుదును ఆపాదించిపెట్టాయి. స్థలాభావం వలన మిగిలిన పాటలను ఉదహరించుట లేదు.
కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా హుషారుగా, విసుగు విరామం లేకుండా చక్కగా సాగింది. ఇందులో శ్రీయుతులు రవికాంత్, శ్రీకుమార్, రవికుమార్, శ్రీనివాస్, భాస్కర్ ప్రభృతులు, శ్రీమతులు సీతాకుమారి, రమాదేవి, సవితశ్రీ ప్రభృతులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వాహకులకు, గాయనీ గాయకులకు ప్రశంసల జల్లు కురిసింది.
ఈనెల 25 న మరియొక పెద్ద ప్రోగ్రామ్, జనవరి రెండవ శనివారం ఆదివారాలలో మెగా ప్రోగ్రామ్ నిర్వహింపబడుతుందని, అందరూ చూసి తమను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రవికాంత్ తెలియజేశారు.

41
947 views