
రెడ్ క్రాస్‌ను బలోపేతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా.
నంద్యాల (AIMA MEDIA): రక్త కొరత రాకుండా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కమిటీ సభ్యులను సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా కమిటీ నూతన సమావేశం జిల్లా రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ (కేసీ కెనాల్ కాంపౌండ్) లో జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షురాలు రాజకుమారి గణియా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో రక్త కొరత రాకుండా రక్తదానంపై అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించడంతో పాటు ఎక్కువ సంఖ్యలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో జూనియర్ రెడ్ క్రాస్ (JRC) యూనిట్లను, ప్రతి కళాశాలలో యూత్ రెడ్ క్రాస్ (YRC) బృందాలను ఏర్పాటు చేసి దాదాపు లక్ష మంది విద్యార్థులను రెడ్ క్రాస్ సభ్యులుగా నమోదు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు వివిధ సామాజిక అంశాలపై శిక్షణ ఇచ్చి రెడ్ క్రాస్ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భవిష్యత్తులో విపత్కర పరిస్థితుల్లో సేవలందించేందుకు రెడ్ క్రాస్ వాలంటీర్ సైన్యాన్ని సిద్ధం చేయాలని, వైద్యుల సహకారంతో చెంచు గిరిజన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రెడ్ క్రాస్ సభ్యత్వాలను విస్తృతంగా పెంచాల్సిన అవసరాన్ని ఆమె వివరించారు. ఈ సమావేశంలో చైర్మన్ దస్తగిరి పర్ల, వైస్ చైర్మన్ డాక్టర్ మమతా రెడ్డి, కోశాధికారి నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ నిషితా రెడ్డి, డాక్టర్ అరుణకుమారి, ఉస్మాన్ భాషా, పేరు సోముల నరసింహమూర్తి, తెలకపల్లి రాధాకృష్ణ, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.