logo

ఆడపిల్లలపై లైంగిక వేధింపుల నివారణపై అవగాహన – మండల స్థాయి అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు

మెంటాడ:
జిల్లా డిఎమ్&హెచ్‌ఓ డా. జీవన్ రాణి ఆదేశాల మేరకు ఆర్‌బిఎస్‌కె విభాగం నుంచి క్లినికల్ సైకాలజిస్ట్ ఉదయ్, శ్రీనివాసుల ఆధ్వర్యంలో మెంటాడ జెడ్పీహెచ్ స్కూలులో శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లలపై లైంగిక దాడులు ఎలా జరిగాయి, అవి ఎలా నివారించాలి, అలాగే పాక్సో చట్టం పిఓసియస్ఓ ముఖ్యాంశాలను విద్యార్థులకు వివరించారు.

దీనితో పాటు మండల కేంద్రంలోని మెంటాడ హైస్కూల్‌లో జిల్లా, మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఆడపిల్లలపై పెరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అధికారులు స్పష్టం చేశారు. సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల దృష్ట్యా పాఠశాలలు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ సమావేశానికి మండల విద్యా అధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, పోలీసు శాఖ ప్రతినిధులు, ఐసీడీఎస్ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. విద్యార్థుల భద్రత కోసం ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సెషన్లు, సీసీ కెమెరా మానిటరింగ్‌ను తప్పనిసరి చేయాలని ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

ఎంపీడీఓ పప్పు సుదర్శన్ మాట్లాడుతూ –
“ఆడపిల్లలపై దాడులు పెరుగుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ముందస్తు చర్యలు తీసుకోవాలి. పాఠశాలలు, తల్లిదండ్రులు, గ్రామస్థులు కలిసి పనిచేస్తేనే ఇలాంటి ఘటనలను అరికట్టగలం. ప్రతి సంఘటనను వెంటనే పోలీసులకు తెలియజేయాలని’’ అన్నారు.

పాఠశాలల్లో ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ వంటి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, హెల్ప్‌లైన్ నంబర్లను పిల్లలకు తెలియజేయాలని అధికారులు సూచించారు. విద్యార్థులు తమ హక్కులను ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించారు.

సమావేశంలో పాఠశాల గదులు, భద్రతా ఏర్పాట్లను అధికారులు పరిశీలించి తక్షణం చేపట్టాల్సిన చర్యలపై సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ కె. మోహన్‌రావు, ఆండ్ర ఎస్సై కె. సీతారాం, మెంటాడ పిహెచ్‌సి డాక్టర్ జి. కల్పన, సిహెచ్‌ఓ సత్యనారాయణ, మేడిపల్లి హైస్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు ఏ.ఎన్.యమ్ సంతోషి ఆసుపత్రి సిబ్బంది గ్రామస్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1
678 views