logo

త్వరలో అమరావతి 'మూడో దశ'.. ఏంటిది?

ఏపీ రాజధాని అమరావతి.. మరిన్ని కొత్త సొబగులు తీర్చిదిద్దుకుంటోంది. ఇప్పటికే నిర్మాణ పనులు వాయు వేగంతో ముందకు సాగుతున్నాయి. రేయింబవళ్లు పనులు జరుగుతున్నాయి.
స్థానికంగానే కాకుండా.. ఒడిశా, బిహార్‌, నేపాల్ సహా ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలను తీసుకువచ్చి.. పనులను పరుగులు పెట్టిస్తున్నారు. 2028 నాటికి తొలి దశ అమరావతి పనులు పూర్తికావాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనులు సాగుతున్న క్రమంలోనే రెండో దశ అమరావతికి సంబంధించి 1666 ఎకరాల భూముల సమీకరణ(పూలింగ్‌)కు నోటిఫికేషన్ ఇచ్చారు.

మొత్తం ఏడు గ్రామాల్లో 1666 ఎకరాలను సేకరించనున్నారు. ఈ క్రమంలో రైతులతో చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు… తాజాగా మూడో దశకు సంబంధించిన సమాచారం కూడా వచ్చేసింది. మంత్రి నారాయణ దీనిపై అప్డేట్ ఇచ్చారు. త్వరలోనే మూడో దశ భూ సమీకరణ ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం తొలిదశలో సేకరించిన 33 వేల ఎకరాలు, ప్రభుత్వం వద్ద ఉన్న 21 వేల ఎకరాల భూముల్లో మొత్తంగా 54వేల ఎకరాల్లో పనులు జరుగుతున్నాయని చెప్పారు. వీటిలో రహదారులు, కోర్ క్యాపిటల్‌, వంతెనలు, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం సహా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు, జడ్జిల భవనాలు నిర్మిస్తున్నామన్నారు.

రెండో విడతలో ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని మంత్రి వివరిచంఆరు. మూడో విడత భూ సేకరణ ఖచ్చితంగా ఉంటుందని.. అయితే.. దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన చెప్పారు. మూడో విడతలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా భూములను సమీకరించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తంగా రాజధాని అత్యంత భారీ నగరంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి చెప్పారు. ప్రధానంగా ప్రపంచస్థాయి నగరంగా దీనిని తీర్చిదిద్దనున్నట్టు వివరించారు. అదేవిధంగా సర్వాంగసుందరంగా అమరావతిని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు తపిస్తున్నట్టు వెల్లడించారు.

అనేక సౌకర్యాలు..

రాజధానిలో అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. అవి ప్రపంచ స్థాయిలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అవేంటంటే..
1) అమరావతి సిటీ 227 చదరపు కిలోమీటర్లు.
2) దీనిలో 30 శాతం పైగా ‘గ్రీన్ అండ్ బ్లూ’ ఏరియా.
3) రోడ్ల వెంట బ్యూటిఫికేషన్
4) 22 రోడ్లలో ఇరువైపులా ఉన్న బఫర్ జోన్‌
5) శాఖమూరు బయో డైవర్సిటీ పార్కు
6) కృష్ణాయపాలెం, నీరుకొండ వద్ద రిజర్వాయర్లు.
7) 20 ఎకరాల విస్తీర్ణంలో దశావతార ఫ్లవర్ గార్డెన్‌

0
0 views