logo

దేశానికి తలమానికమైన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం **
డిసెంబర్ 2 **(ఏఐఎం ఐ మీడియా ప్రతినిధి)

డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి


*దేశానికే తలమానికం డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ,


*ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధితో తెలంగాణ అగ్రగామిగా ఎదుగుదల.. సీఎం రేవంత్ రెడ్డి

*పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్ఫూర్తితో అందరం పని చేస్తున్నాం,

*సీతారామ ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం,

కొత్తగూడెం, డిసెంబర్ 02:(కానుక న్యూస్ జిల్లా ప్రతినిధి):ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఎదుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇంచార్జి మంత్రి వాకాటి శ్రీహరి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపిలు బలరాం నాయక్, రామ సహాయం రఘురాం రెడ్డిలతో కలిసి పర్యటించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి కి కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఎస్పి బి. రోహిత్ రాజు ఘన స్వాగతం పలికారు.
కొత్తగూడెంలో నెలకొల్పిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మద్దతుకు ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు మీద కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని అన్నారు.గతంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసం వందల ఎకరాల భూమి రైతులు ఇస్తే స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఉపాధి లభించడంతో మొట్ట మొదటిసారి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడింది పాల్వంచ ప్రాంతంలోనని, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఈ ప్రాంతం అందించిందని అన్నారు.60 సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు ఈ విశ్వ విద్యాలయానికి పెట్టుకోవడం మన అందరికీ ఎంతో గర్వకారణం అని అన్నారు.భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం అభివృద్ధి చెందడానికి ఎడ్యుకేషన్, ఇరిగేషన్ పాలసీ అమలు చేశారని, ప్రస్తుతం దేశంలో ఉన్న గొప్ప విశ్వ విద్యాలయాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆనాటి ప్రధానమంత్రినెహ్రూ ప్రారంభించినవి అని అన్నారు.బాక్రానంగల్ నుంచి నాగార్జునసాగర్ వరకు,శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు నీటి పారుదల ప్రాజెక్టులను జవహర్ లాల్ నెహ్రూ నిర్మించారని తెలిపారు. దేశం మొదటి ప్రధాని స్ఫూర్తితో ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తెలంగాణను దేశ పటం మీద మొదటి స్థానంలో నిలుపుతుందని తమ ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఉన్న అపారమైన ఖనిజ సంపదను గుర్తించి వాటి మీద పరిశోధనలు జరగాలని ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అదేవిధంగా దేశానికే తలమానికంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ చరిత్రత్మకంగా నిలవబోతుందని ఇక ఇప్పుడు శాస్త్రవేత్తలను ప్రపంచానికే పరిచయం చేయబోతుందని ఈ ఘనత మన ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి చరిత్ర పుటల్లో స్థానం కలిగించబోతుందని అన్నారు అదేవిధంగా కొత్తగూడెంకు వైద్య కళాశాల, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణం వంటి గొప్ప విద్యాలయాలను ఖమ్మం జిల్లాకు అందించాలని లక్ష్యంతో ముందుకు పోతున్నామని అన్నారు. గోదావరి, కృష్ణ జలాలు ఖమ్మం జిల్లాకు వస్తాయని, ఇక్కడ ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పొలాలకు నీరు ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించిందని, సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు పెండింగ్ ఉన్న మిగిలిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. రాష్ట్ర పాలనకు ఆయువు పట్టు ఉమ్మడి ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో ఉందని, ఇక్కడ ప్రముఖ శాఖలు నిర్వహిస్తున్న ముగ్గురు మంత్రులు అనుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదని అన్నారు. ప్రజలకు రేషన్ కార్డు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు ఇటువంటి అనేక కార్యక్రమాలను ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభించామని అన్నారు. భద్రాద్రి శ్రీ రామ చంద్రుని సాక్షిగా ఉమ్మడి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటున్నట్లు సీఎం సభాముఖంగా తెలిపారు. ప్రజలు వేసిన ఓటు ఫలితంగా రెండు సంవత్సరాల కాలంలో మంచి పాలన అందిస్తున్నామని తెలిపారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి మంత్రులు ఎంత ప్రధానమో ప్రతి గ్రామ పంచాయతీకి సర్పంచ్ పదవి అంతా ప్రాముఖ్యత కలిగిందని గ్రామ అభివృద్ధి అంతా సర్పంచ్ భుజస్కందాలపైనే ఉంటుందని అందువల్ల ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా దక్షత దీక్షిత కలిగిన మంచి అభ్యర్థులను, పని చేయగలిగే వారిని ఎన్నుకోవాలని, డబ్బులకు మద్యం బాటిళ్లకు, ప్రలోభాలకు లొంగవద్దని సీఎం రేవంత్ రెడ్డి సభాముఖంగా పిలుపు నిచ్చారు.డిసెంబర్ 8, 9 తేదీలలో జరిగే తెలంగాణ విజయోత్సవాలు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన మంత్రి తదితర ప్రముఖులను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళుతున్నానని, మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తానని, ఇక్కడ ప్రజలు అందించే ప్రేమ పూర్వకమైన స్వాగతం తనకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుందని సీఎం తెలిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేస్తుందని, భూమి పరిసరాలు, భూమి లోపల ఉన్న ఖనిజాల గురించి విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరుగుతాయని, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే విద్యాలయం లకు నేడు తొలి అడుగు వేసామని అన్నారు. దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని, ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి అవసరమైన వసతులు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అన్నారు.వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ దేశానికే తలమానికంగా ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు మీద కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దేశంలో వినూత్న విశ్వవిద్యాలయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కేటాయించి నందుకు ప్రజల తరఫున సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగూడెం జిల్లాకు గోదావరి జలాలు, విద్యుత్ కేంద్రం రావాలని అన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు అదనంగా నిధులు మంజూరు చేశారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెంకు విమానాశ్రయం ఏర్పాటు చేయాలని అన్నారు.రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తున్నామని, ప్రజలు పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి తమ ఆశీర్వాదాలు అందించాలని అన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజక వర్గంపై ప్రత్యేకమైన ప్రేమతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న, ఎర్త్ యూనివర్సిటీని ఈ ప్రాంతానికి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, 800 మెగా వాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం లభించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు విద్యా చందన, వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అశ్వరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైరా నియోజకవర్గ o ఎమ్మెల్యే రాందాస్ నాయక్, సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మట్టా రాగమయి, ఇల్లెందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, ఆర్డీఓ మధు, ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

77
3196 views