
డి.మత్స్యలేశం తీరానికి బంగ్లాదేశ్ మత్స్యకారులు
శ్రీకాకుళం : బంగ్లాదేశ్‌కు చెందిన 13 మంది మత్స్యకారులు చేపల వేట చేస్తూ సముద్రంలో దారి తప్పి శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశం తీరానికి ఆదివారం చేరుకున్నారు.వారి బోటును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆకలితో ఉన్న వారికి స్థానిక మత్స్యకారులు భోజనం పెట్టారు. మెరైన్ సిఐ ప్రసాదరావు, ఎచ్చెర్ల పోలీసులు, మత్స్యశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని వీరిని కళింగపట్నం మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దిత్వా తుపాను నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో వీరు అదుపు తప్పి వచ్చారా?
వేరే కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో వారిని బంగ్లాదేశ్‌లోని బోలబార్సిల్ జిల్లా చర్‌కోలాచద్ గ్రామానికి చెందిన సయివ్, జహంగీర్, సభీర్, కోకన్, మఖ్‌సూద్, మాలిక్, మహ్మద్ ఫరూఖ్, మాక్‌సుద్, నాసిర్, హెలెల్, ఫరూఖ్, అలామ్, సమెన్‌గా గుర్తించారు. వీరు నవంబరు పదో తేదీన చేపల వేటకు వెళ్లి తప్పిపోయినట్లు గుర్తించారు. సముద్రంలో బోటు దారి తప్పి, 20 రోజుల తర్వాత డి.మత్స్యలేశం సముద్ర తీరానికి చేరుకున్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.