logo

చంద్రబాబుపై పాత కేసులన్నీ వెనక్కి? బెయిల్ రద్దు కోరబోతున్న వైసీపీ ..!

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం సహా ఇతర కేసుల్ని కూటమి సర్కార్ వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇది అధికార దుర్వినియోగమేనని వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. దీనిపై తాము కోర్టుల్ని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.
అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి కేసులను మాఫీ చేసుకుంటున్న చంద్రబాబు... అవినీతి మురికిని అధికారంతో కడిగేసుకుంటున్నారని పొన్నవోలు ఫైర్ అయ్యారు. ప్రజాప్రయోజనం ఉంటే తప్ప కేసు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం లేదని కోర్టులు నిర్దేశించినా.... చంద్రబాబు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్న ఆయన... తన న్యాయవాదుల మీద తప్ప చట్టం మీద బాబుకు నమ్మకం లేదనన్నారు. ఉంటే ధైర్యంగా కేసులు ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. అసలు విచారణకే రాకుండా అధికార బలంతో అడ్డుకోవడంతో పాటు, కేసులు విత్ డ్రా చేసుకుంటే.. నువ్వు శుద్దపూస ఎలా అవుతావు చంద్రబాబూ అని నిలదీశారు. ఇవన్నీ బెయిల్ రద్దుకు కారణాలేనని.. దీనిపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.
లిక్కర్ స్కామ్ లో గత ప్రభుత్వ హయాంలో ఏపీ బ్రావరేజీ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డి ఫిర్యాదుతో చంద్రబాబుపై కేసు నమోదు చేశారన్నారు. 2012-15 వరకు ఏ -4 లిక్కర్ షాపులకు ఉన్న ప్రివిలైజ్ ఫీజు తీసేయడం వల్ల ప్రభుత్వానికి రూ.2984 కోట్లు నష్టం జరిగిందని గుర్తుచేశారు. దీంతో పాటు బార్లకు కూడా ప్రివిలైజ్ ఫీజు తీసేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకి వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందన్నారు. ఫైనాన్షియల్ కన్సెషన్ ఇవ్వదల్చుకుంటే... బిజినెస్ రూల్స్ ప్రకారం ఆర్థికశాఖ మందుకు కానీ, మంత్రిమండలి ముందుకు కానీ లేదంటే మంత్రుల బృందం వద్దకు కానీ వెళ్లాలి. ఇవన్నీ బైపాస్ చేసి, చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన నిందితులు ఏ-4 షాపులకి, బార్లకు ప్రివిలైజ్ ఫీజు తొలగించారన్నారు.
రాష్ట్రంలో పీఎంకె డిస్టలరీస్, విశాఖ డిస్టలరీస్ తో పాటు మరో మూడింటికి కలిపి మొత్తం 5 డిస్టలరీలకు చట్ట వ్యతిరేకంగా చంద్రబాబు అనుమతులు మంజూరు చేశారని, ఇవాళ మార్కెట్ లో కనిపిస్తున్న ప్రెసిడెంట్ మెడల్, బూమ్ బూమ్ వంటి బ్రాండ్లు అన్నింటికీ ఆయన ప్రభుత్వమే తెచ్చిందని పొన్నవోలు ఆరోపించారు. దీని ద్వారా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగించారనివాసుదేవరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేస్తే దాన్ని క్రైమ్ నెంబరు 18/2023 కింద కేసు నమోదు చేశారన్నారు. తర్వాత పరిణామ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే... ఫిర్యాదుదారు, ఎండీ వాసుదేవరెడ్డి, అక్కడే పనిచేస్తున్న సత్యప్రసాద్ ని భయపెట్టి... వాసుదేవరెడ్డి ద్వారా కోర్టులో కేసు విత్ డ్రాకు అభ్యంతరం లేదని లెటరు పైల్ చేయించారు. ఇంతకన్నా సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం ఉంటుందా? ఇవి బెయిల్ కేన్సిల్ చేయడానికి కారణాలు కావా? అని ప్రశ్నించారు.
ఇలాంటి కేసులు ఎప్పుడు విత్ డ్రా చేసుకోవచ్చన్నది చట్టం నిర్దేశిస్తుందని, కేవలం సమాజానికి మంచి జరిగినప్పుడు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలి కానీ.. మీ స్వప్రయోజనాల కోసం అధికారం మీ చేతిలో ఉందని విత్ డ్రా చేయడం చట్ట సమ్మతం కాదని పొన్నవోలు తెలిపారు. వైయస్సార్సీపీ లీగల్ టీమ్ దీనిపై కచ్చితంగా పోరాటం చేస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పులు చేసి, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వంలో కేసులు నమోదైతే మరలా వారికి అధికారం వచ్చిన రోజు కేసులు విత్ డ్రా చేసుకుంటారని, ఇది చట్ట సమ్మతం కాదని తెలిపారు. అప్పట్లో కేసుపెట్టిన వాసుదేవరెడ్డితో ఇప్పుడువిత్ డ్రా చేయించడం సాక్షులను బెదిరించడం కిందకే వస్తుందని, ఇవన్నీ బెయిల్ రద్దు కావడానికి కారణం అవుతాయని పొన్నవోలు సుధాకర్ రెడ్డి తేల్చిచెప్పారు.

7
238 views