logo

రఘురామపై టార్చర్ కేసులో కీలక పరిణామం..! సీనియర్ ఐపీఎస్ కు బిగ్ షాక్..!

ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును గత వైసీపీ ప్రభుత్వంలో టార్చర్ చేసిన కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
తనపై కస్టడీలో దాడి చేసిన వారిపై కూటమి సర్కార్ చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికే ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇవాళ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారికి సమన్లు పంపింది.

గత వైసీపీ ప్రభుత్వంలో ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ సీఐడీ ఛీఫ్ గా పనిచేశారు. అప్పట్లో రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగా ఉన్నారు. వైసీపీ నుంచి గెలిచి సొంత ప్రభుత్వంపై నిత్యం విమర్శలకు దిగేవారు. ఈ క్రమంలోనే ఆయన్ను నియంత్రించేందుకు అప్పటి జగన్ సర్కార్ రఘురామరాజుపై రాజద్రోహం ఆరోపణలతో కేసు నమోదు చేయించి అరెస్టు చేసింది. అనంతరం గుంటూరు సీఐడీ కస్టడీలోకి తీసుకున్న రఘురామపై అక్కడ పోలీసులు దాడి చేసారు. అనంతరం గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి డాక్టర్లు కూడా ఆయనకు గాయాలేవీ కాలేదని తప్పుడు రిపోర్టులు ఇచ్చారు.
ఈ వ్యవహారంపై రఘురామ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో మరోసారి పరీక్షలు చేయించుకునేందుకు అనుమతి తెచ్చుకున్నారు. అలాగే బెయిల్ కూడా తెచ్చుకున్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన రఘురామరాజు.. అప్పట్లో తనపై దాడి చేసిన పోలీసులపై కూటమి సర్కార్ వచ్చాక చర్యలు తీసుకుంటారని ఆశించినా పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి వదిలేశారు. దీనిపై రఘురామ చాలా కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా తనపై దాడి చేయించినట్లు ఆరోపిస్తున్న ఐపీఎస్ పీవీ సునీల్ కుమార్ ను కనీసం నోటీసులు ఇచ్చి విచారణకు సైతం పిలిపించకపోవడంపై అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో గుంటూరు పోలీసులు ఎట్టకేలకు రఘురామ కేసుపై కదిలారు. ఆయనపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ను వచ్చే నెల 4న విచారణకు హాజరుకావాలని నోటీసులు పంపారు. ఈ మేరకు గుంటూరు సీసీఎస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఎస్పీ దామోదర్ నోటీసుల్లో పేర్కొన్నారు. పీవీ సునీల్ విచారణ తర్వాత ఈ కేసుపై గుంటూరు పోలీసులు తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

5
313 views