
ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్* *భారత రాజ్యాంగ దినోత్సవ అవగాహన కార్యక్రమం*
తేదీ:26-11-2025,శేర్లింగంపల్లి,చందానగర్ :ఈరోజు ఉదయము గౌలిదొడ్డిలో గల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు భారత రాజ్యాంగ దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ అవగాహన కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ T అంజయ్యగారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి ఆచార్య A నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ "1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. ఈ రోజునే భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. గతంలో దీనిని 'నేషనల్ లా డే'గా జరుపుకునేవారము. డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ 125వ జయంతోత్సవమైన 2015వ సంవత్సరము నుండి భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము" అని అన్నారు. "1947లో స్వాతంత్ర్యానంతరం డిసెంబరు మాసంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికై డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన 7గురు (అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, N గోపాలస్వామి, K M మున్షి, మహమ్మద్ సాజుల్లా, B L మిట్టల్, D P ఖైతాన్ ) సభ్యులతో డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ యొక్క రిపోర్టును 1949 నవంబరు 26న ఆమోదించి 1950 జనవరి 26 నుండి అమలులోకి తేవడం జరిగింది. రాజ్యాంగం వ్రాయడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది. సుమారు దీనికైన ఖర్చు 64 లక్షల రూపాయలు. రాజ్యాంగం ఆమోదించినప్పుడు అందులో 395 ఆర్టికల్సు, 22 భాగాలు, 8 షెడ్యూల్స్ తో రూపొందించారు. భారత రాజ్యాంగాన్ని ప్రేమ్ బిహారీ నారాయన్ రాయ్ జాదా ఇటలీ కాలీగ్రఫీ స్టైల్ లో చేతి వ్రాతతో ఆంగ్లము మరియు హిందీ భాషలలో వ్రాశారు. కాలక్రమేణా సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం కొరకై ఇప్పటికి 106 పర్యాయాలు భారత రాజ్యాంగాన్ని సవరణలు చేయడం జరిగింది" అని అన్నారు. "ప్రస్తుత రాజ్యాంగంలో 448 ఆర్టికల్సు, 25 భాగాలు, 18 షెడ్యూల్స్ ఉన్నాయి. రాజ్యాంగ సవరణలకు పార్లమెంటు ఉభయ సభలలో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. కొన్ని సవరణలలో మెజారిటీ రాష్ట్ర శాసనసభల ఆమోదము కూడా అవసరం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనది. అలాగే అధిక పర్యాయాలు సవరణలు పొందిన రాజ్యాంగం కూడా మనదే. మన రాజ్యాంగం భారత పౌరులందరికీ న్యాయము, స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి లక్షణాలను అందిస్తుంది. భారత రాజ్యాంగ పీఠిక రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని తెలియజేస్తుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 నుండి ఇండియా సర్వ సత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. అందువలననే మనము ప్రతి యేటా జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నాము" అని అన్నారు.
"భారత రాజ్యాంగం కుల, మత, ప్రాంత, లింగ, భాషా వివక్షతలు లేకుండా అందరికి అన్నీ అందిస్తూ ఉన్నది. రాజ్యాంగ విధులకు లోబడి సుపరిపాలన కొనసాగించడానికి రాజ్యాంగంలో మూడు వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అవి
1. న్యాయ వ్యవస్థ (తాలూకా న్యాయస్థానం నుండి భారత సుప్రీం కోర్టు వరకు). ఇది చట్టన్ని సమర్థిస్తుంది.
2. శాసన వ్యవస్థ (శాసనసభ, శాసన మండలి, లోక్ సభ, రాజ్య సభ) ఇవి చట్టాలను రూపొందిస్తాయి.
3. కార్య నిర్వాహక వర్గం (తహసీల్దార్ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు) ఇది శాశ్వతము. తాత్కాలిక కార్యనిర్వాహకము 5 సంవత్సరములకు ఒకసారి ఎన్నుకోబడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలోని ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వ మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు మంత్రివర్గ సభ్యులు. వీరు చట్టాన్ని అమలు చేస్తారు. ఈ మూడు వ్వవస్థలు దేనికవే స్వతంత్రంగా రాజ్యాంగానికి లోబడి వ్యవహరిస్తాయి. ఈ మూడింట కన్నా రాజ్యాంగమే సుప్రీం. మన రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వ అధికారాలు, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి అధికారాలను రూపొందించి 7వ షెడ్యూల్ లో పొందుపరిచారు. ఇది సమాఖ్య వ్యవస్థకు పునాది వంటిది.
భారత రాజ్యాంగం భారతదేశ పాలనకు సంబంధించిన అనేక అంశాలు పేర్కొంటుంది. వీటిలో
1) కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలు విధులు ఉంటాయి.
2) వివిధ ప్రభుత్వాల నిర్మాణానికి అవసరమయ్యే ఎన్నికల వ్యవస్థ గురించిన అంశాలు ఉన్నాయి
3) పౌరుల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు, సమానత్వానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి
4) రాజకీయ లక్ష్యాలైన హక్కులు స్వేచ్ఛ సమానత్వం న్యాయం సౌభ్రాతృత్వం జాతీయ సమైక్యత సమగ్రతలకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి
5) సమాజంలో చారిత్రకంగా దోపిడికి అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి.
6) దేశంలో వివిధ స్థాయిల్లో ( జాతీయ రాష్ట్ర స్థానిక స్థాయిలో) శాసననిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ శాఖల అధికారాలు ఉంటాయి.
ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు. ఇది భారతీయ పౌరులందరికీ జీవన విధానం" అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరి చేత రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్) ను చదివించారు. భావి భారత పౌరులైన విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలి. అలాగే ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని గౌరవించాలి " అని కోరారు. ఈ కార్యక్రమంలోవైస్ ప్రిన్సిపాల్ మల్లారెడ్డీ అధ్యాపకులు బసవయ్య , సత్యనారాయణ , లింగయ్య , బిక్షమయ్య , కిషోర్ , అంజి , డాక్టర్ లింగరాజు విద్యార్థులు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.