logo

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు

క్రౌన్ హ్యూమన్ రైట్స్ అమరావతి నవంబర్ 25;

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో మూడు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాల ఏర్పాటుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటుపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. కేబినెట్ సబ్ కమిటీ సమర్పించిన నివేదికపైనా చర్చించారు. ఈ క్రమంలోనే ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. రంపచోడవరం జిల్లా కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే ముందుగా ప్రచారంలో ఉన్నట్లుగానే మార్కాపురం, మదనపల్లె జిల్లాల ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మరోవైపు ఏపీలో కొత్తగా మరో ఐదు రెవెన్యూ డివిజన్లు కూడా ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రతిపాదనకు కూడా సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర, అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసే మదనపల్లె జిల్లాలో పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. నంద్యాల జిల్లాలో కొత్తగా బనగానపల్లె రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. వీటితో పాటుగా కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం విభజించేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆదోని మండలం విభజించి పెద్దహరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయనున్నారు.మరోవైపు రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై అధ్యయనం చేసేందుకు మంత్రులు నారాయణ, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, నిమ్మల రామానాయుడుతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ వివిధ ప్రాంతాలలో పర్యటించి అభిప్రాయాలను తెలుసుకుంది. అనంతరం నివేదిక తయారు చేసిన మంత్రుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికపై సీఎం చంద్రబాబు నాయుడు గత రెండు రోజులుగా కసరత్తు చేశారు. అనంతరం మార్కాపురం ప్రజల చిరకాల కోరికను నెరవేరిస్తూ మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న మదనపల్లెను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. అలాగే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు చంద్రబాబు పచ్చజెండా ఊపారు.

0
57 views