
ఆయనను బీఆర్ఎస్ నుండి తరిమేసి తప్పు చేశారు: కవిత
బీఆర్ఎస్ పార్టీపైనా .. ఆ పార్టీ నేతలపైనా విమర్శలు చేస్తున్న తెలంగాణ జాగృతి నాయకురాలు, మాజీ ఎంపీ కవిత తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి..
ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ ఎస్ పార్టీ నుంచి తరిమేసి పెద్ద తప్పు చేశారని కవిత అన్నారు. ఆయనను అలా పంపించేసినందుకే.. బీఆర్ ఎస్ పార్టీ ఓడిపోయిందన్నారు. బీఆర్ ఎస్ ఓటమిలో తుమ్మల వ్యవహారం కూడా ఒకటి అని తేల్చిచెప్పారు. పార్టీలో పనిచేసేవారికి ప్రాధాన్యం లేదన్న కవిత.. పక్కనే ఉండి గోతులుతవ్వే వారికి అవకాశం ఇచ్చారన్నారు.
“తుమ్మల వంటి నాయకుడిని బయటకు పంపించి.. బీఆర్ ఎస్ పార్టీ అతి పెద్ద తప్పు చేసింది.” అని కవిత వ్యాఖ్యానించారు. తుమ్మలకు ఎంతో అనుభవం ఉందన్నారు. ఆయనకు రామదాసు ప్రాజెక్టు అప్పగిస్తే..నిర్విఘ్నంగా పూర్తి చేశారని తెలిపారు. అయినా.. పార్టీలో ఆయనకు చోటు లేకుండా చేశారని అన్నారు. తనను కూడా అలానే అవమానించి బయటకు పంపించారని తెలిపారు. కవిత చేస్తున్న ‘జాగృతి జనం యాత్ర’ ఖమ్మం జిల్లాకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె తుమ్మల గురించి ప్రస్తావి స్తూ.. సుదీర్ఘంగా మాట్లాడారు. తాను 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశానని చెప్పారు. అయినా..కనికరం కూడా లేకుండా బయటకు పంపించారన్నారు.
ప్రస్తుతం ప్రశ్నించే గొంతులు నిద్రపోతున్నాయన్న కవిత.. ప్రజల కోసమే తాను జనం బాట పట్టినట్టు చెప్పారు. తనపై ఎవరెవరో విమర్శలు చేస్తున్నారని.. ఆ విమర్శలు తను పట్టించుకోనని చెప్పారు. కవితను ప్రజలే ఆదరిస్తున్నారని చెప్పారు. ప్రజలతో వారి ఆశీర్వాదంతోనే తాను.. తాను యాత్ర చేస్తున్నానన్నారు. కాగా.. తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర విభజన వరకు కూడా టీడీపీలో ఉన్నారు. తర్వాత.. ఆయన బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో 2016లో వచ్చిన ఉప ఎన్నికలో విజయం దక్కించుకున్నారు.
తర్వాత.. 2018 ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసినా పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలో పువ్వాడ అజయ్‌ను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. ఇక, అప్పటి నుంచి తుమ్మలను కేసీఆర్ పక్కన పెడుతూ వచ్చారు. ఇక, 2023 ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో ఆయన విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. కాగా.. తుమ్మల ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేయడం విశేషం.