logo

కువైట్ నుంచి వచ్చిన తండ్రి.. ఇద్దరు పిల్లల్ని గోదారిలో తోసి ఆత్మహత్య

ఇటీవల కువైట్ నుంచి వచ్చిన తండ్రి ఆధార్ అప్డేట్ చేయిద్దాం రండి అని ఇద్దరు పిల్లల్ని బయటకు తీసుకెళ్లి.. గోదావరిలో తోసేసి చంపేశాడు.
ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త, పిల్లల మరణంతో ఆ ఇల్లాలి రోదనకు అంతులేదు. ఈ విషాదకరమైన ఘటన తూర్పుగోదావి జిల్లా మలికిపురం మండలం లక్కవరంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉపాధి రీత్యా కువైట్ వెళ్లొచ్చిన శిరిగినీడి దుర్గాప్రసాద్ (37).. భార్య, పిల్లలతో లక్కవరంలో స్థిరపడ్డాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య నాగవేణి తండ్రి ఇటీవల గల్ఫ్ నుంచి రావడంతో వారంరోజులుగా విశ్వేశ్వరాయపురంలో ఉంటున్నారు. సోమవారం (నవంబర్ 17) కొడుకు మోహిత్ (13), కూతురు జాహ్నవి (9)లను ఆధార్ అప్డేట్ చేయిద్దాం రండి అంటూ బయటకు తీసుకెళ్లాడు దుర్గాప్రసాద్. రాత్రికి ప.గో జిల్లా యలమంచిలి స్టేషన్ పరిధిలోని చించినాడ వశిష్ఠ వారధిపై వెహికల్, చెప్పులు, ఫోన్ నంబర్లు రాసి ఉన్నకాగితాన్ని స్థానికులు గుర్తించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం నదిలో గాలించగా.. దుర్గాప్రసాద్, మోహిత్ మృతదేహాలు లభ్యమయ్యాయి. జాహ్నవి ఆచూకీ కోసం నేడు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా.. పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు,లేక మరేదైనా కారణం ఉందా ? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

5
695 views