
*హైదరాబాదులో మరోసారి ఐటి దాడుల కలకలం*
హైదరాబాద్ : నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతోంది. ప్రముఖ హోటళ్ల చైర్మన్‌లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నారు. హైద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న హోటల్స్ బిజినెస్‌పై ఐటీ సోదాలు నిర్వహించారు.మొత్తం 30 చోట్ల ఏకకాలంలో ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు. పిస్తా హౌస్, షాగౌస్, మేహిఫెల్ హోటల్లో యజమానుల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్ , మేహిఫెల్ హోటల్స్ ప్రతి ఏటా వందల కోట్లు వ్యాపారం చేస్తున్నాయి. ఈ హోటల్స్ ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.
రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ ఓనర్ మహమ్మద్ మజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో రికార్డుల్లో చూపిన ఆదాయం, నిజమైన ఆదాయం మధ్య వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హవాలా, నకిలీ లావాదేవులు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్యాక్స్ చెల్లింపులో వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. పిస్తా హౌస్ ఓనర్ మజీద్ నివాసంలో నాలుగు బృందాలు సోదాలు జరుపుతున్నాయి. పిస్తా హౌస్‌లో పనిచేసే వర్కర్ల ఇళ్లల్లోనూ, వర్కర్లకు కల్పించిన వసతి నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హార్డ్ డిస్క్‌లో డేటాను ఐటీ ఆఫీసర్స్ పరిశీలిస్తున్నారు.
అలాగే షేక్‌పేట్‌లోని మేహిఫిల్ రెస్టారెంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మొత్తం రెండు బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్‌లో మొత్తం 15 హోటల్స్‌ను మేహిఫిల్ నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం నిర్వహిస్తోంది. ఈక్రమంలో మేహిఫిల్ రెస్టారెంట్స్ రికార్డులను ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆదాయ , వ్యయాలు, ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన డాక్యుమెంట్స్‌ను పరిశీలిస్తున్నారు. వాస్తవాదాయానికి రికార్డుల్లో చూపించిన ఆదాయానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు కూడా ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది.