logo

రక్షక భటులే రక్షణ భటులై --తుఫాన్ తాకిడిలో ప్రజలకు అండగా పోలీసులు


జర్నలిస్ట్ : మాకోటి మహేష్

అవనిగడ్డ : మెంథా తుఫాన్ ధాటికి దివిసీమ వణికిపోయిన వేళ, రక్షక భటులుగా ఉన్న పోలీసులు నిజమైన రక్షణ భటులుగా మారి ప్రజలకు అండగా నిలిచారు. ఈదురుగాలులు, కుండపోత వర్షాలు, విరిగిపడిన చెట్లు, రహదారులపై ఏర్పడిన అడ్డంకులు.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా విధుల్లో నిమగ్నమై ప్రాణాలకు తెగించి సేవలందించారు.

తుఫాన్ కారణంగా రెండు రోజులుగా ప్రజలు ఇళ్లలోనే చిక్కుకుపోయిన వేళ, రహదారులపై విరిగిపడిన చెట్లను తొలగిస్తూ, రవాణాకు ఆటంకం లేకుండా చూసేందుకు అవనిగడ్డ సీఐ గాజుల యువకుమార్, ఎస్‌ఐ కె. శ్రీనివాస్, వారి సిబ్బంది క్షణక్షణం శ్రమించారు. రాత్రి పగలు తేడా లేకుండా తుఫాన్ గాలులు, వర్షం మధ్యలో రహదారులపై కాపలా కాస్తూ, సహాయక చర్యలను సమన్వయం చేశారు.

మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, గాలులు మధ్యలో అవనిగడ్డ - కోడూరు రోడ్డులో, అవనిగడ్డ - నాగాయలంక రోడ్డులో, కొత్తపేట రోడ్డులో విరిగిపడిన చెట్లను జేసీబీల సహాయంతో తొలగించి రవాణా సాఫీగా జరిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రజలు ఇళ్లలో సురక్షితంగా ఉండేలా ఎక్కడైనా చెట్టు పడిందన్న సమాచారం అందగానే అక్కడికి చేరుకుని రాత్రంతా మేల్కొని పనిచేశారు.

తుఫాన్ ధాటికి ఎక్కడైనా ప్రమాదం సంభవిస్తుందేమోనన్న భయంతో రాత్రంతా కాపలాగా నిలిచిన పోలీసులు ప్రజల మనసు గెలుచుకున్నారు. డీఎస్పీ రాజు, సీఐ యువకుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు తమ బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తించారు. గాలుల మధ్యలో వర్షంలో తడుస్తూ చెట్లను కత్తిరించి రోడ్లను శుభ్రం చేయడం, ట్రాఫిక్‌ను సజావుగా కొనసాగించడం వంటి పనుల్లో పోలీసులు అచంచలంగా ఉన్నారు.

ఇక మరోవైపు ప్రజలు ఆశించిన విధంగా రెవెన్యూ, ఆర్ అండ్ బీ శాఖల అధికారులు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించకపోవడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తుఫాన్ ప్రారంభమైనప్పటి నుండి రహదారులపై ఏర్పడిన అడ్డంకులు తొలగించే బాధ్యత ఆ శాఖదే అయినా, క్షేత్రస్థాయిలో మాత్రం పోలీసులు మాత్రమే కనిపించడం చర్చనీయాంశమైంది. “ఆర్ అండ్ బీ శాఖ, రెవిన్యూ శాఖ అధికారులు ఉన్నారా లేదా?” అనే ప్రశ్నలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం ప్రజలను అవసరమైతే తప్ప బయటకు రాకూడదని హెచ్చరించినా, ఆ సూచనలను పక్కన పెట్టి ప్రజల భద్రత కోసం తుఫాన్ గాలుల్లో తడుస్తూ కాపలా కాసిన పోలీస్ బలగాలు ప్రజల మనసు గెలుచుకున్నాయి. తుఫాన్ వల్ల అత్యధిక ప్రభావం చూపిన అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు ప్రాంతాల్లో పోలీసులు మాత్రమే ప్రతి మలుపులో కనిపించారు.

దివిసీమలో ఇటీవలి 10 ఏళ్లలో ఎదురైన అత్యంత ఘోరమైన తుఫాన్‌ను ప్రజల ప్రాణనష్టం లేకుండా ఎదుర్కోవడంలో పోలీస్ బలగాల కృషి కీలకం అయింది. *“రక్షక భటులే రక్షణ భటులై”* అన్న నినాదం ఈ తుఫాన్ సమయంలో సాక్షాత్కారమైంది. ప్రజల భద్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఈ పోలీస్ సిబ్బంది నిజమైన హీరోలుగా నిలిచారు.

6
1492 views