logo

శ్రీ గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో 10 వేల పుట్టమన్ను శివలింగాల ప్రత్యేక పూజలు

నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రానికి సమీపంలో గల నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కార్తీక మాసం ద్వాదశి సందర్భంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 10 వేలకు పైగా పుట్టమన్ను శివలింగాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా, సుమారు 200 మందికి పైగా మహిళలు తొలుత పుట్టకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి, ఆ మట్టిని సేకరించారు. అనంతరం ఆ పుట్టమన్నుతో చిన్న చిన్న శివలింగాలను తయారు చేసి, వాటికి ప్రత్యేక పూజలు చేసి, భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. పుట్టమన్ను శివలింగాల పూజానంతరం, భక్తులు ఉత్సాహంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం నిర్వహించారు.
అలాగే అమ్మవారికి వడిబియ్యం సమర్పణ, మరియు అన్నదానం కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నల్లగట్ల వెంకటేశ్వర్లు, పసుపుల వీరయ్య, కృష్ణం లోకేష్, ఎల్లంపల్లి చంద్ర, కానాల నరసింహులు, మౌలాలి రెడ్డి, మేడ భరత్ కుమార్, లింగం వెంకటరంగనాయకులు, నల్లగట్ల వెంకట సత్యనారాయణ, పెరుమాళ్ళ నరసింహయ్య, కేసి నరసింహులు తదితరులతో పాటు రుద్రవరం మరియు మండలం పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.

25
1870 views