logo

బాధితులకు అండగా ఉంటాం..రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి - మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు పరామర్శ - పరిహారం చెక్కుల పంపిణీ

శ్రీకాకుళం:కాశీబుగ్గలోని వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
ఆదివారం మందస మండలం మందస, బెల్లుపటియాలో బర్రి బృందావతి, దువ్వు రాజేశ్వరి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి పరామర్శించారు. వారికి ప్రభుత్వం తరపున రూ.15లక్షలు చొప్పున పరిహారం చెక్కులు అందజేశారు. కుటుంబ సభ్యులను కోల్పోవడం ఎంతో బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పీరుకట్ల విఠల్‌, బావన దుర్యోధన, మల్లా శ్రీనివాసరావు, రట్టి లింగరాజు, బమ్మిడి కర్రయ్య, దాసరి తాతారావు, తమిరి భాస్కరరావు, మండల లచ్చయ్య, నవీన్‌ పాల్గొన్నారు.

అలాగే కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు పలాస, టెక్కలి, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లో పర్యటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. టెక్కలి మండలం పిట్టలసరియా, రామేశ్వరం గ్రామాల్లో చిన్నమ్మి, విజయ కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. వజ్రపుకొత్తూరు మండలం దుక్కవాని పేట మురిపింటి నీలమ్మ కుటుంబానికి రూ.15లక్షల చెక్కును అందజేశారు. నందిగాం మండలం శివరాంపురంలో చిన్ని యశోదమ్మ కుటుంబ సభ్యులకు చెక్కును పంపిణీ చేశారు. పలాసలో డొక్కరి అమ్ముడమ్మ భర్త రాజారావుకు రూ.15లక్షలు అందజేశారు.

సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన లొట్ట నిఖిల్‌ కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ.15 లక్షలు, కలెక్టర్‌ ప్రకటించిన రూ.లక్ష మొత్తంగా చెక్కును ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ అందజేశారు.

క్షతగాత్రులకు రూ.3లక్షలు చొప్పున..

రాగోలులోని జెమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులకు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గొండు శంకర్‌ ప్రభుత్వం తరపున రూ.3లక్షలు చొప్పున పరిహారం అందజేశారు. మందస మండలం బెల్లుపటియాకు చెందిన దువ్వు కుమారి, నందిగాం మండలం రౌతుపురానికి చెందిన బడే కళావతికి చెక్కులను పంపిణీ చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలని వైద్యులకు కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆర్డీవో సాయి ప్రత్యూష, తహసీల్దార్‌ ఎం.గణపతి, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

8
79 views