logo

*ప్రజా విద్యా, వైద్యం పై కాసులేరుకుంటున్న కూటమి పాలకులు.* *సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ విమర్శ.*



ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన పాలకులు అందరికీ ఉచిత విద్యా, వైద్యం అనే హామీలు కేవలం కాగితాలకే పరిమితం చేసి ప్రజా విద్య, వైద్యం పై కూటమి ప్రభుత్వ పాలకులు కాసులేరుకుంటున్నారని సిపిఐ జిల్లా సహాయ బుగత అశోక్ విమర్శించారు.
బుధవారం ఉదయం భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) మార్కెట్ శాఖా సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ప్రజారంగ సంస్థలను ప్రైవేటుపరం చేసి కార్పొరేట్ దోపిడీ వర్గాలకు అప్పజెప్పేస్తు చంద్రబాబు కూటమి ప్రభుత్వ చేతకానితనాన్ని నిరూపించుకుంటున్నారని దుయ్యబట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ వైద్య విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పించడానికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ను గత ప్రభుత్వం కోరిక మేరకు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వరంగ సంస్థలో నడపడానికి అవకాశం కల్పిస్తూ నిధులు కల్పించిందన్నారు. ఆనాడు ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రారంభించడానికి ఆర్థిక పరిస్థితులు సరిపోవడం లేదని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదన్నారు. అదేమిటంటే మొదటి విడతలో 5 కళాశాలలు, రెండవ విడత 5 కళాశాలలు, మూడో విడతలు 7 కళాశాలల్ని ప్రారంభిస్తామని ఆనాటి వైకాపా ప్రభుత్వం తెలిపిందన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీలో భాగంగా మొదటి విడతలో 5 మెడికల్ కళాశాలల నిర్మాణం సకాలంలో పూర్తి చేసి మచిలీపట్నం , ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం , నంద్యాలలో ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటి విద్యాశాఖ మంత్రి యువగళం పాదయాత్ర చేసినప్పుడు వేలాది మంది విద్యార్థి యువతను సమీకరించి "ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైకాపా ప్రభుత్వం వైద్య విద్యను అంగట్లో సరుకులాగా అమ్మేస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే ఈ జీవో నెంబర్ 107, 108 రద్దు చేస్తాను, వైద్య విద్యను ప్రతిఒక్క విద్యార్థికి అందేవిధంగా చొరవ చేపడతానని" హామీ ఇచ్చిన సంగతి అధికారం రాగానే లోకేష్ మతి ఏమైందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం కేవలం సెల్ఫ్ ఫైనాన్స్ కోట పేరుతో 50 పర్సెంట్ సీట్లను కార్పొరేట్ విధానంగా నడిపారు కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏకంగా పి.పి.పి పద్ధతిలో పబ్లిక్, ప్రైవేట్, పార్ట్నర్షిప్ భాగస్వామ్యం అనే పాలకుల జేబులు నింపుకోవడానికి ఈ దుర్మార్గ విధానంతో ఏకంగా కళాశాలలన్నీ కూటమి ప్రభుత్వం కార్పొరేట్లకు అప్పనంగా కట్టబెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవడి సొమ్ముని ఎవడికి దానధర్మం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక ఎకరా ప్రభుత్వ భూమిని 99 రూపాయలకు ఇస్తారా..? ప్రజలు ఓట్లేసి గెలిపించి మిమల్ని నమ్మి గద్దెనెక్కిస్తే ప్రజలకు, ప్రజల ఆస్తులకు రక్షణ ఉండి సమర్థవంతంగా నడిపించడం చేతకాక ప్రజారంగ సంస్థలపైన, భూములపైన కార్పొరేట్లకు పెత్తనం ఇస్తూ నిస్సిగ్గుగా 66 సంవత్సరాలకు లీజు అగ్రిమెంట్ ఇస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూడా నడపలేమని ప్రైవేటోడికి అప్పగించేసి ప్రజాప్రతినిదులందరూ ఇళ్ళ దగ్గరే ఉండిపోతే సరిపోతుందని విమర్శించారు. మీకు విద్యార్థి, యువత మరియు ముఖ్యంగా వారి యొక్క తల్లిదండ్రులు ఓట్లు వేసి పరిపాలన చేసే అవకాశం కల్పించింది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే కానీ 66 సంవత్సరాలు కాదని చంద్రబాబు నాయుడు జ్ఞప్తికి తెచ్చుకోవాలని హితవు పలికారు. మీరు తీసుకుంటున్న నియంతృత్వ విధానాల వలన బడుగు బలహీనవర్గాల, మధ్యతరగతి విద్యార్థులకు తీరని శాపంగా మారుతోందన్నారు. డబ్బు ఉన్నవాడు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి లేదా వారి పలుకుబడిని ఉపయోగించి అప్పులు చేసి మరీ విద్యను అభ్యసించి వైద్యునిగా స్థిరపడిన తర్వాత కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి ఆధునిక భవనాలు, వైద్య యంత్ర పరికరాలు ఏర్పాటు చేసి పెట్టుబడిగా పెట్టి వైద్యరంగాన్ని వ్యాపారంగా తయారై పేద, మధ్య తరగతి ప్రజలను కార్పొరేట్ వైద్యం పేరుతో రక్తం పీల్చే జలగల్ల దోపిడీ చేస్తుండటం మీ కళ్ళకి కనబడలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సామాజిక, ఆర్థిక దోపిడీ విధానాలకి అడ్డుకట్ట వేయాలంటే ఆంధ్రప్రదేశ్ లో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని మీ పాలకులు సుదీర్ఘంగా చర్చించి అవసరమైతే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఆ వైపుగా తీర్మానం చేసి ఆమోదం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించారు.

6
941 views