logo

బంగారం ధరలు మళ్ళీ డౌన్.. కారణం ఇదే....

కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. ఈ పండుగ సీజన్ ముగిసే లోపు బంగారం కొందామనుకునే వారికి ఇది కాస్త ఊరటనిచ్చినా, ఇన్వెస్టర్లకు మాత్రం షాక్ తగిలింది. ఒక్క వారం రోజుల్లోనే పసిడి ధర ఏకంగా రూ. 3,557 (2.80 శాతం) పడిపోయింది. ఈ పతనం వెనుక ఉన్న అసలు కారణం అమెరికా చైనాకు సంబంధించిన ఒక డీల్ అని తెలుస్తోంది.

వీరి మధ్య ఒక ట్రేడ్ డీల్‌ కుదిరే అవకాశం ఉందని, దానిపై మార్కెట్ లో పెరుగుతున్న నమ్మకమే అని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ పరిణామాల వల్ల, సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారంపై ఉన్న ఆసక్తి తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో, డిసెంబర్ డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా రూ. 1,546 తగ్గి రూ. 1,21,905కు చేరింది.....

బంగారం మాత్రమే కాదు, వెండి ధర కూడా MCXలో అదే స్థాయిలో పడింది. డిసెంబర్ డెలివరీ వెండి ఫ్యూచర్స్ గత వారం రోజుల్లో 5.83 శాతం తగ్గిపోయింది. ట్రేడ్ డీల్‌పై నమ్మకం పెరగడం, యూఎస్ డాలర్ బలంగా మారడం వల్లే సేఫ్ హెవెన్ డిమాండ్ తగ్గి, బంగారం ధరలు తగ్గుతున్నాయని ఆస్పెక్ట్ బులియన్ అండ్ రిఫైనరీ సీఈఓ దర్శన్ దేశాయ్ తెలిపారు. డాలర్ ఇండెక్స్ కూడా స్వల్పంగా పెరగడం ఈ పతనానికి మద్దతు ఇచ్చింది.....

మలేషియాలో అమెరికా, చైనా ప్రతినిధులు రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. ఎగుమతి నియంత్రణ, వ్యవసాయ వాణిజ్యం వంటి కీలక అంశాలపై ఇద్దరూ ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చారు. ఈ చర్చలు విజయవంతం కావడంతో, త్వరలో సౌత్ కొరియాలో జరిగే సమావేశంలో డోనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ ఈ డీల్‌ను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఈ సానుకూల వాతావరణమే బంగారంపై ఒత్తిడి పెంచుతోంది.....

అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పసిడి ధరలు భారీగా తగ్గాయి. సోమవారం కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 1.49 శాతం తగ్గి, 4,076 డాలర్లకు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అమెరికా చైనా ట్రేడ్ చర్చలే అని తెలుస్తోంది.....

ఈ వారం జరగబోయే ఫెడరల్ రిజర్వ్, ఇతర సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలపై కూడా వ్యాపారులు దృష్టి పెట్టారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో గోల్డ్ మార్కెట్ లో మళ్ళీ ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.....

28
3911 views