
మెంథా తుఫాన్ ప్రభావంపై సమీక్షిస్తున్న ఏపీ సీఎం & డిప్యూటీ సీఎం
AIMA న్యూస్. బ్యూరో అమరావతి.మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్ష ప్రభావంతో ఆకస్మికంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారంనాడు ఆర్టీజీఎస్ నుంచి మొంథా తుపాను ప్రభావంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి సమీక్షించారు. గతంలో వచ్చిన తుఫాన్ల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం మొంథా తుఫాను కోస్తాంధ్ర తీరానికి అత్యంత సమీపంగా వస్తోందని ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా చేరుకుని తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం కాకినాడ, మచిలీపట్నం, విశాఖ తదితర తీరప్రాంతాల్లో వర్షాలు, గాలుల తీవ్రత ఎక్కువగా ఉందని సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాలకు మరిన్ని రెస్క్యూ బృందాలను, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశించారు. గాలులు, వర్ష తీవ్రతను అంచనా వేస్తూ అందుకు తగినట్టుగా యంత్రసామాగ్రిని, సమాచార పరికరాలను అత్యవసర యంత్రాలను, బృందాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రెండు రోజుల నుండి రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి ఎంత ప్రాంతం నీట మునిగింది. ఏయే వాగులు పొంగే ప్రమాదం ఉందో అంచనా వేసి లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నిర్దేశిత గ్రామ వార్డు సచివాలయాల నుండి క్షేత్రస్థాయి సమాచారం తెప్పించుకుని విశ్లేషించుకోవాలన్నారు. గతంలో హుద్ హుద్ తుఫాను సృష్టించిన విధ్వంసం నుంచి ప్రజలను నాలుగు రోజుల్లో తిరిగి బయటకు తెచ్చామని సీఎం గుర్తు చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం నుండి భారీ వర్షాలు నమోదైనందున ఆ ప్రాంతంలోని ఎర్రకాలువకు ఎగువ నుంచి ఆకస్మాత్తుగా ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేయటంతో పాటు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.గడచిన 24 గంటల్లో విశాఖ, కోనసీమ, శ్రీకాకుళం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, నెల్లూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయని అధికారులు వివరించారు. మొంథా తుపాను ప్రభావం కారణంగా వర్ష ప్రభావిత జిల్లాల్లోని 1.92 కోట్ల మందికి భారీ వర్ష సూచనలకు సంబంధించిన సమాచారాన్ని మొబైల్ ఫోన్లకు పంపామని తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా 2,703 జనరేటర్లను కూడా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని సీఎంకు తెలిపారు. సచివాలయాల వారీగా నిత్యావసర వస్తువులను కూడా సిద్ధం చేసుకున్నట్టు వివరించారు. అత్యవసర సమయంలో కమ్యూనికేషన్ కోసం పోలీసు విభాగం 81 టవర్లతో వైర్ లెస్ సిస్టంను ఏర్పాటు చేశామన్నారు. జేసీబీలు, యంత్ర పరికరాలను కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్టు సీఎంకు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం పశువులకు కావాల్సిన గ్రాసం కూడా సిద్ధంగా ఉంచాలని సూచించారు. డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాన్ని, చెట్లు, టవర్లు, హోర్డింగ్ లు పడిపోయిన ప్రాంతాలను గుర్తించి తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వర్ష ప్రభావంతో ఇప్పటి వరకూ 43 వేల హెక్టార్ల పంట నీట మునిగిందని అధికారులు తెలిపారు. కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పంట నీటమునిగిందని సీఎంకు వివరించారు. అయితే పంట నష్టం వివరాలను రైతులు కూడా పంపేలా వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ లో మార్పు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తుఫాను కారణంగా రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్ల ధ్వంసం వంటివి జరిగితే ఊళ్ల మధ్య రాకపోకలకు ఇబ్బంది అవుతుందని. అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్ర స్థాయి యంత్రాంగంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని, అందరూ ఫీల్డులో ఉన్నారని మంత్రి నారా లోకేష్ సీఎంకు వివరించారు. ప్రస్తుతం రాయలసీమలో తక్కువ వర్షాలు ఉన్నందున ఎగువ నుండి వచ్చే కృష్ణా ప్రవాహాలను అక్కడి చెరువులు నింపే ప్రక్రియను చేపట్టాలని సీఎం జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ఒక్క టీఎంసీ నీటిని కూడా కోల్పోకుండా నీటిని నింపే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షకు మంత్రులు అనిత, నారాయణ, అనగాని సత్యప్రసాద్, సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.