
తుఫాన్‌పై ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది – MLA బొండా ఉమ
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, అక్టోబర్ 28: (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు బంగాళాఖాతంలో ఏర్పడిన “మొంథా” తుఫాన్ రాష్ట్ర తీరాన్ని దాటబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలను చేపట్టిందని, ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఉదయం సింగ్ నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులు తుఫాన్ సన్నద్ధత పనుల్లో నిమగ్నమై ఉన్నారని చెప్పారు.
గత రెండు రోజులుగా నియోజక వర్గంలోని లోతట్టు ప్రాంతాలను, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సమస్య లను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. “తుఫాన్ ప్రభావం వల్ల రానున్న రెండు, మూడు రోజులు వర్షాలు, ఈదురుగాలులు సంభవించే అవకాశం ఉంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సురక్షిత ప్రదేశాలకు తరలాలి. చెట్ల సమీపంలో నివసిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాలి” అని బొండా ఉమ హెచ్చరించారు.
సర్కారు ఆధ్వర్యంలో నగరంలో అనేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఆ కేంద్రాల్లో అవసరమైన ఆహారం, నీరు, వైద్య సేవలు, విద్యుత్ సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. పునరావాస కేంద్రాల్లో తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ₹3,000 నగదు సహాయం, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరఫరాలు అందజేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం టెలికాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ, జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు, ఎమ్మెల్యేలను అప్రమత్తం చేస్తున్నారని ఆయన వివరించారు. “వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాత్రి తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 100–120 కిమీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు ఇళ్లలోనే ఉండాలి. షాపులు, పాఠశాలలకు సెలవులు ప్రకటించాం” అని తెలిపారు.
ఇక సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో వచ్చిన బుడమేరు వరదలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, వదంతులు నమ్మవద్దని ప్రజలను కోరారు.
“పునరావాస కేంద్రాలు సెంట్రల్ నియోజకవర్గంలోని కమ్యూనిటీ హాల్స్, ప్రభుత్వ పాఠశాలలలో ఏర్పాటు చేశాం. అత్యవసర సమయాల్లో అధికారులు ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలు సహకరిం చాలి” అని బొండా ఉమ విజ్ఞప్తి చేశారు.