
“మొంథా” తుఫాను నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
*జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్*
రానున్న నాలుగు రోజుల పాటు "మొంథా" తుఫాను ప్రభావం మన రాష్ట్రంపై చూపుతుందని, ఈ తుఫాను కాకినాడ-విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఎక్కువగా వుందని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ అక్టోబర్ 26న ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో వచ్చిన “హూద్-హూద్” మరియు "నీలం" తుఫానులను దృష్టిలో ఉంచుకొని అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. “మొంథా” తుఫాను ప్రభావంతో తీరం వెంబడి బలమైన గాలులు మరియు భారి వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపధ్యంలో మస్త్యకారులు ఎవరు కూడా అక్టోబర్ 26 నుండి 29 వరకు సముద్రంలో వేటకు వెళ్ళవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ జిల్లా పోలీస్ అధికారులను అప్రమత్తం చేసారు. “మొంథా” తుఫాను కారణంగా జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బందికి సెలవులను కూడా రద్దు చేసినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో తీర ప్రాంత మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం అధికారులను మరియు సిబ్బందిని ముందస్తు చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ముందస్తు చర్యలులో భాగంగా తుఫాను షెల్టర్ హోమ్ లను, సహాయక శిభిరాలను సిద్దం చేయాలని, తుఫాను తీవ్రతను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను షెల్టర్ హోమ్లకు, సహాయక శిభిరాలకు తరలించడం, అవసరమైన మేరాకు జేనరేటర్లు, జేసిబిలు, ఎలెక్ట్రికల్ రంపాలు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. పోలీస్ అధికారులు విద్యుత్, రెవిన్యూ, పంచాయతీరాజ్, మునిసిపాలిటి అధికారులతో సమన్వయము చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పూసపాటిరేగ ఎస్.ఐ. 9121109447, భోగాపురం రూరల్ సి.ఐ. 9121109428, భోగాపురం పోలీస్ స్టేషన్ సి.ఐ. 9121109445 లను సంప్రదించవచ్చని జిల్లా ఎస్పీ కోరారు.
“మొంథా” తుఫాను కొరకు జిల్లాలో పోలీస్ శాఖ తరుపున జిల్లా హెడ్ క్వార్టర్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని, ఈ కంట్రోల్ రూములో అక్టోబర్ 26 నుండి 29 వరకు 24 గంటలు సిబ్బంది మరియు ఒక డిఎస్పీ స్థాయి అధికారి తుఫాను తీవ్రతను పర్యవేక్షిస్తారని, ప్రజలకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు జారీ చేస్తారని తెలిపారు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే వెంటనే జిల్లా పోలీస్ కంట్రోల్ రూముకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 08922224455, 9121109483, 9121109423, 100/112 ను ప్రజలు వినియోగించుకోవాలని లేదా స్థానిక పోలీసులను సంప్రదించాలని ప్రజలను జిల్లా ఎస్పీ కోరారు.