logo

ఘోర ప్రమాదం జరిగిన మూడు గంటల్లోపే బస్సు ఫిట్నెస్ పై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి

ఘోర ప్రమాదం

జరిగిన మూడు గంటల్లోపే బస్సు ఫిట్నెస్ పై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎలా క్లీన్ చిట్ ఇస్తారు? ఇప్పటికే ఈ బస్సుపై 19 చలానాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇన్ని చలానాలు పెండింగ్ లో ఉన్న బస్సు ఫిట్నెస్ గా ఎలా ఉంటుంది? ఈ బస్సును రోడ్డుపైకి ఎలా అనుమతించా రంటూ.. వైయస్ఆర్ సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ప్రదేశాన్ని వైయస్ఆర్ సీపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం జరిగిన తక్కువ సమయంలోనే మంత్రి బస్సు ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నారంటే, బస్సు ఓనర్ వీరికి బంధువా, స్నేహితుడా, లేక వీరి పార్టీకి చెందిన వ్యక్తా అని ప్రశ్నించారు. సంబంధిత అధికారులు వచ్చి బస్సును పూర్తి స్థాయిలో పరిశీలించి సర్టిఫికెట్ ఇవ్వాలి, అలా కాకుండా మంత్రి
స్పాట్ లోనే సర్టిఫికెట్ ఇవ్వడమేంటి? ఇంత కంటే దుర్మార్గం లేదన్నారు. బస్సు, ప్రయాణికులు మన రాష్ట్రానికి సంబంధించిన వారు కాదని మంత్రి మాట్లాడటం సబబు కాదు, ప్రయాణికుల్లో నెల్లూరు, తూర్పు గోదావరి, హైదరాబాద్, బెంగళూరుకు చెందిన వారున్నారు. వీళ్లేమైనా ఇతర దేశాలు, గ్రహాలకు చెందిన వారా? అని ఆయన ప్రశ్నించారు. కనీస మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేటు యాజమాన్యాలు ఇద్దరు డ్రైవర్లను పెడితే, ఇద్దరికీ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని, సింగిల్ డ్రైవర్ తోనే రాత్రంతా డ్రైవింగ్ చేయించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల నుంచి రూ.కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు.

మృతుల కుటుంబాలకు న్యాయంచేయాలి..

బస్సు దగ్ధమైన సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం అందించాలని వైయస్ఆర్ సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక కోరారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రమాదాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బస్సులో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా చూడాలన్నారు. మృతి చెందిన కుటుంబాలకు అందించే సహాయాన్ని తక్షణమే ప్రకటించాలన్నారు. మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ప్రకటించడంతో పాటు ఆయా కుటుంబాల్లోని నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కూడా ఒక బస్సుకు అనుమతి తీసుకొని నాలుగు బస్సులను తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. బస్సుకు ఫిట్నెస్ ఉందా? ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? అనే విషయాలను సంబంధిత అధికారులు పరిశీలించాలన్నారు. ఇలాంటి సంఘటనలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిదేనని వారు డిమాండ్ చేశారు.

4
169 views