
కౌలురైతులకు అరి చేతిలో వైకుంఠం చూపిస్తున్న కూటమి సర్కార్.
కౌలురైతులకు అరి చేతిలో వైకుంఠం చూపిస్తున్న కూటమి సర్కార్.
ప్రతి కౌలు రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది రూ॥ 20 వేలు ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసి గద్దెనెక్కిన తర్వాత ఆచరణలో విస్మరించింది.కౌలు రైతులను కేంద్రప్రభుత్వం గుర్తించకపోయిన రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించి "అన్నదాత సుఖీభవ పథకం"కింద రాష్ట్రంలో ఉన్న భూమిలేని కౌలు రైతులకు ప్రత్యేకంగా సంవత్సరానికి రూ॥ 20వేలు చొప్పున ఇస్తామని, వైకాపా ప్రభుత్వం "రైతుభరోసా" పెరుతో పెట్టుబడి సాయాన్ని కొన్ని కులాలకు ఇచ్చిందని,మేము సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా కౌలురైతులందరికి అండగా నిలబడతామని చెప్పిన విషయం కూటమి నేతలకు గుర్తు లేకపోవడం బాధాకరం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఖజానా ఖాళీగా ఉందని రబీ నుండి ఇస్తామని చెప్పారు. ఖరీఫ్ లో ఇవ్వలేదు. రబీలో ఇవ్వలేదు. రెండో ఏడాదిలో పెట్టుబడి సాయం అందజేస్తామని నమ్మబలికారు. తీరా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సొంత భూమి కలిగిన రైతులకు,సాగు చెయ్యని భూ యజమానులకు మొదటి విడతగా కొంత ఇచ్చి కౌలు రైతులకు మాత్రం మొండిచెయ్యి చూపించారు.
కౌలురైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి ఈ- పంటలో నమోదు చేసి జాబితాలు రూపొంచిన తరువాత అక్టోబర్ నెలలో ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఇటీవల అచ్చెన్న మాట్లాడుతూ కౌలురైతులకు మొదటి విడతగా దీపావళి కానుకగా రూ॥ 10వేలు కౌలు రైతుల ఖాతాలో జమ చేస్తామని వాగ్దానం చేశారు.
ఈ లబ్ధి పొందడానికి కౌలురైతు గుర్తింపు కార్డు మరియు ఈ-పంటలో వారు సాగు చేస్తున్న పంటలను నమోదు చేసుకోవాలని సూచించారని ఈ నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోనే 5.9 లక్షల మందికి ఊరట కల్పిస్తుందని చెప్పి మురిపించి మభ్యపెట్టారు. తీరా దీపావళి కూడా పోయింది అన్నదాత సుఖీభవ పథకం అటకెక్కిందనిపిస్తుంది.
రాష్ట్రంలో వ్యవసాయం అంటే కౌలు వ్యవసాయమే, రైతులంటే కౌలు రైతులే .అన్ని పంటలలోనూ, అన్ని ప్రాంతాల్లోనూ కౌలువిధానం విస్తరిస్తున్నది.వ్యవసాయ రంగంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నది కౌలు రైతులేనని స్పష్టమవుతుంది. సుమారు 32 లక్షల మంది కౌలు రైతులు ఉంటారని ప్రాథమిక అంచనా. ఇందులో భూమిలేని పేద కౌలురైతులు 12 నుండి 15 లక్షల ఉంటారని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. దురదృష్టకరం అంశం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎటువంటి డేటా లేకపోవటం. కానీ నిరంతరం డేటా గురించి,డేటా సెంటర్ల గురించి క్యాబినెట్ సమావేశంలో చర్చోప చర్చలు చేస్తారు. కానీ వ్యవసాయ రంగంలో సొంత భూమి కలిగిన రైతులంతా మంది,భూమి లేని కౌలురైతులు ఎంతమంది, భూమి ఉండి కౌలుకు చేసే కౌలురైతులు ఎంతమంది, వ్యవసాయం చేయకుండా ఉండేవారు ఎంతమంది అనేది లెక్కలు లేకపోవడం శోచనీయం. కౌలు రైతులపట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుండే కౌలురైతులకు సులభంగా గుర్తింపు కార్డులు జారీ చేసి 2024-2025 సంవత్సరం నుండే పెట్టుబడిసాయం ఇస్తామని ఊరూరా చెప్పి ఆ ఏడాది ఒక పైసా ఇవ్వకుండా చేతులు ఎత్తివేసారు.ప్రస్తుత సంవత్సరంలో సాగు చేయని భూ యజమానులకు ముందుగా ఇచ్చి వాస్తవ కౌలు రైతులకు ఇవ్వకుండా అరచేతిలో వైకుంఠం చూపించారు. అక్టోబర్‌లో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మాట మరిచినట్టుంది.పెట్టుబడి సాయం ఏదీ అని కౌలురైతులు అడుగుతుంటే ఈ-పంట నమోదు పూర్తి కాలేదని చెప్పటం సిగ్గుచేటు. ఈ- పంట నమోదు ఎందుకు చేయలేదని, జాప్యం ఎందుకు జరుగుతున్నదని దీనికి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం.దిన్ని బట్టి పరిశీలిస్తే ఈ నెలలో అన్నదాత సుఖీభవ పథకం అమలు లేనట్లే అర్థమవుతుంది, ఖరీఫ్ సీజన్ దాటిపోయి రబీ సీజన్ ప్రారంభమైంది.ఈ సమయంలోనే కౌలురైతులకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ సంవత్సరం అధిక వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. రెండు, మూడుసార్లు వ్యాపార పంటలకు విత్తనాలు వేయటం, వరి పంటకు నాట్లు వేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, యంత్రాల అద్దెలు,వ్యవసాయ కూలీలు రేట్లు పెరగడంతో పెట్టుబడి తడిసి మోపడవుతుంది.పంటలు కోతకు వచ్చే సమయంలో పెట్టుబడి సాయం అవసరమని కౌలురైతులు భావిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వానికి కౌలురైతుల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీనమేషాలు లెక్కపెట్టకుండా భూమి లేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం కింద రూ॥ 20 వేలు పెట్టుబడి సాయాన్ని తక్షణమే అందించి ఆదుకోవాలి. పెట్టుబడి సాయం బిక్ష కాదు పంటలు పండించే వాళ్ళకి ఇన్పుట్ అవసరాల కోసం ఇచ్చే ఆర్థిక సాయం. వాస్తవంగా పంటలు పండించే వారిని విస్మరించి చెమట చుక్క చిందించని, సాగు చెయ్యని భూ యజమానులకు ఇవ్వడం ఏమిటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
అసలు ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలు ఒక్కసారి కూటమి సర్కార్ గుర్తు తెచ్చుకోవడం మంచిది.
అధికారంలోకి వచ్చిన వెంటనే వైకాపా ప్రభుత్వం తెచ్చిన ఆంధ్రప్రదేశ్ పంటసాగుదారుల హక్కుల చట్టాన్ని సవరిస్తామని, ప్రతి ఏడాది గ్రామసభలు నిర్వహించి భూ యజమాని ప్రమేయం లేకుండానే కౌలుగుర్తింపు కార్డులు జారీ చేస్తామని వీటి ఆధారంగా వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు తదితర పథకాలను అందజేసి కౌలురైతులకు అండగా నిలబడతామని కర్నూలు జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారాలోకేష్ ప్రకటించారు.ఆ సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబానికి లక్ష రూపాయలు
చొప్పున ఆర్థిక సహకారం అందించారు.ఇలాంటి నేతలు అధికారంలోకి వస్తే కౌలురైతుల బ్రతుకులు బాగుపడతాయని నమ్మారు.
ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, బిజెపి ,జనసేన కూటమి కౌలు రైతులకు అనేక వాగ్దానాలు చేసింది. సులభంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడ పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు ప్రాంతాల్లో రైతులు,కౌలురైతులతో సమావేశాలు నిర్వహించి అదుగో కౌలురైతుల చట్టం, ఇదిగో కౌలు రైతుల సంక్షేమం అని ఊరూరా చాటింపులు వేసుకున్నారు. చివరికి చట్టం ఉసే లేకుండా పోయింది. కౌలు రైతులకు చట్టం ఎప్పుడు తెస్తారు అని అడిగితే కంటి చూపు లేదు. నోటిమాట లేదు. చేసిన వాగ్దానాలు,ఇచ్చిన హామీలను కోటమి సర్కారు తుంగలో తొక్కింది. కౌలు రైతులను నట్టింట ముంచింది. తీవ్రమైన సంక్షోభంలో ఉన్న కౌలు రైతులను ఆదుకోవడానికి 17 నెలల కాలంలో కౌలు రైతులకు వరగబెట్టింది ఏమీ లేదు.గతేడాది ఏ పంటకు కూడా మద్దతు ధర దక్కలేదు.అతి తక్కువుకు షావుకారులకు,
దళారులకు అమ్ముకొని నష్టపోయారు. కనీసం పంటలకు పెట్టిన సాగు ఖర్చులు కూడా రానటువంటి దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతంలో చేసిన అప్పులు ఎలా తీర్చాలో, ప్రస్తుతం పంటలకు పెట్టిన పెట్టుబడి వస్తోందో, రాదో తెలియని దయనీయమైన స్థితిలో కౌలురైతాంగం ఉంది.ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే తక్షణమే 20 వేల రూపాయలు ఒకేసారి కౌలు రైతుల ఖాతాలో జమ చేయాలసిన పరిస్థితి ఉంది.తద్వారా కూటమి సర్కారు చిత్తశుద్ధిని పరీక్షించుకోవలసి ఉంది. లేకపోతే భవిష్యత్తులో కూటమి సర్కారు ఉనికినే ప్రశ్నించే పరిస్థితి వస్తుంది.
పి.జమలయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం