
ఆంధ్ర ప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గా కామ్రేడ్ గుజ్జు ల ఈశ్వరయ్య ఎన్నిక:
తెలంగాణ స్టేట్** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** అక్టోబర్ 22**( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)
Sd. రబ్బానీ (9652413118)
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గా యువ నాయకత్వానికి పగ్గాలు :
*ఆంధ్ర ప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గా కామ్రేడ్ గుజ్జు ల ఈశ్వరయ్య ఎన్నిక:
*విద్యార్థి నాయకుడి నుంచీ...కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగిన పేదింటి ముద్దు బిడ్డ:
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీపీఐ పార్టీ లో ఓ నవశకం ఆరంభం అయ్యింది. ప్రస్తుత దేశ రాజకీయ , ఆధునీకరణకు ,మారుతున్న కాలానికి అనుగుణంగా యువ నాయకత్వానికి స్వాగతం పలికింది. జాతీయ సమావేశాల అనంతరం నాయకత్వ మార్పు పై తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో చాలా వేగవంతంగా అడుగులు వేసింది. ఇప్పటికే నాయకత్వ మార్పు విషయంలో తర్జన భర్జన పడుతూ కౌన్సెల్ సమావేశాన్ని వాయిదా వేసుకొన్న రాష్ట్ర పార్టీ ఎట్టకేలకు ఈరోజు జరిగిన రాష్ట్ర సమితి సమావేశంలో నూతన నాయకత్వాన్ని ప్రకటించింది. కడప జిల్లా, తొండూ రు మండలం , భద్రం పల్లె లో గుజ్జుల బాలమ్మ, ఓబన్న దంపతులకు జీ. ఈశ్వరయ్య ఆరవ సంతానం. కటిక పేద కుటుంబం కావడం వల్ల ఆకలి భాద ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అనుభవించాడు. చదువుకొనే వయసులో నే కూలి పనులకు వెళ్ళక తప్పలేదు. అనాధ ల ( బాల సదన్) బడిలో వుండి, అక్కడే తింటూ చదువుకున్నాడు. ప్రైమరీ స్కూల్ చదువు పూర్తయ్యాక ఉన్నత విద్య కోసం పట్నంలోకి ( కడప) రావల్సి వచ్చింది. అక్కడి నుంచే తన జీవితానికి సరికొత్త ద్వారాలు తెరుచుకున్నాయి. ఏడవ తరగతి చదువుతున్న రోజుల్లో ఏ ఐ ఎస్ ఎఫ్ లో చేరారు. మట్టిని పిసికిన చేతులు ఏ ఐ ఎస్ ఎఫ్ జెండాను ఆమాంతం భుజానికి ఎత్తు కొన్నాయి. పదవ తరగతి అనంతరం కడప ఆర్ట్స్ కళాశాల లో డిగ్రీలో బీ ఏ గ్రూప్ తీసుకొని చదువు.. పోరాడు అనే నినాదాన్ని ఏ మాత్రం విస్మరించకుండా ఓ వైపు చదువుతూనే ఒక ప్రక్క తమ కాలేజీ లోని విద్యార్థుల సమస్యల కోసం పోరాటం చేస్తూ వచ్చారు. విద్యార్థుల స్కాలర్ షిప్స్ కోసం అలుపెరుగని పోరాటాలకు శ్రీకారం చుట్టారు. స్కాలర్ షిప్స్ రాని ఎంతోమంది విద్యార్థులకు స్కాలర్ షిప్స్ రావడం లో ఆనాడు ఈశ్వరయ్య పోరాట పాత్ర వుంది. ఆ పోరాట పటిమను ను గుర్తించిన కమ్యూనిస్టు పార్టీ ఆయన్ని కడప జిల్లా ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి గా ఎంపిక చేసింది. డిగ్రీ పూర్తయిన వెంటనే పోస్టు గ్రాడ్యుయేషన్ విద్య కోసం శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ ( ఎస్వీయూ) లో ఎం ఏ చేసారు. ఎస్వీ యూనివర్సిటీ లో స్టూడెంట్ ఉద్యమాన్ని నడిపించడంలో ఈశ్వరయ్య గారి పాత్ర చాలా ఉందనే చెప్పవచ్చు. అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే , విద్యార్థి ఉద్యమాలను అలవోకగా నడిపారు.
.* విద్యార్థి,యువజన సంఘాలకు జీవం పోశారు*
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ( ఏ ఐ ఎస్ ఎఫ్) , అఖిల భారత యువజన సమాక్య ( ఏ ఐ వై ఎఫ్) రాష్ట్ర కార్యదర్శి గా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ( తెలంగాణ) లో పనిచేసారు. హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకొని అప్పుడున్న 26 జిల్లాల్లో విద్యార్ధి ఉద్యమాన్ని తీవ్రతరం చేసారు. డిగ్రీ లో బీకాం పూర్తి చేసిన అభ్యర్థులకు బీ ఈ డీ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేసిన అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రభుత్వంపై ఉవ్వెత్తున ఉద్యమాన్ని నడిపి , జీవో ను రద్దు చేయించారు. ఆ తర్వాత యువజన విభాగం లో కూడా క్రియాశీలకంగా పనిచేసారు. విచ్చల విడిగా ఇంజనీరింగ్ కళాశాల లకు అనుమతులు ఇచ్చి, ఇంజినీరింగ్ విద్యను భ్రష్టు పట్టించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ పత్రికా వ్యాసం కూడా వ్రాసారు.నిరుద్యోగులు, యువకులు ఎదుర్కొంటున్న ఆనేక సమస్యల పైన యువజన సమాఖ్య చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం కోసం అహర్నిశలు కృషి చేశారు.ఫలితంగా హైద్రాబాద్ లో తలపెట్టిన సైకిల్ యాత్ర ముగింపు సభ దిగ్విజయంగా ముగిసింది. ఇలా విద్యార్థి,
యువజన సమాఖ్య లను ఒంటిచేత్తో నడిపించారు.
*అతి తక్కువ కాలంలోనే అంచలంచెలుగా కమ్యూనిస్టు పార్టీ లీడర్ గా*
విద్యార్థి,యువజన బాధ్యతల అనంతరం కడప సీపీఐ జిల్లా కార్యదర్శి గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ కాలంలోనే జిల్లాలోని అన్ని మండలాల్లో కమ్యూనిష్టు పార్టీ ని పునః నిర్మించారు. పాత రిమ్స్ ఆసుపత్రి కోసం అలుపెరగని పోరాటం చేసి, ఆసుపత్రి సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దాంట్లో సఫలీకృతులయ్యారు. కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఘనత ఒక్క సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి గా గుజ్జల ఈశ్వరయ్య గారికే దక్కుతుంది . అదే విధంగా పేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, అసైన్డ్ భూముల్లో జెండాలు పాతి, రెవిన్యూ యంత్రాంగాన్ని నిలదీసి ప్రశ్నించారు.ఫలితంగా దాదాపు పది హేను రోజులు జైలు జీవితం గడిపారు. పార్టీ కార్యాలయాన్నే తన నివాసంగా మార్చుకొని నిత్యం కార్యకర్తలకు, పేద వారికి అందుబాటులో వుండి పని చేసారనడంలో యెటువంటి సందేహం లేదు. కడప జిల్లా కార్యదర్శి గా మూడు పర్యాయాలు పని చేసిన అనంతరం రాష్ట్ర ఉద్యమ అవసరాల కోసం పార్టీ విజయవాడకి ఆహ్వానించింది. విజయవాడను కేంద్రంగా చేసుకొని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుల హోదాలో రాష్ట్రమంతా తీరిక లేకుండా తిరిగారు. ఏ జిల్లాకు ఇన్చార్జి గా బాధ్యతలు అప్పజెప్పినా తను తీసుకొన్న బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం కోసం నిరంతరం కృషి చేసారు. అయన పార్టీ కోసం పడే తపన,, పార్టీ నిర్మాణం కోసం చేసే కృషే ఆయన్ని రాష్ట్ర అందలం మీద కూర్చోబెట్టిందనే చెప్పవచ్చు!!
**బాల కార్మికుడి నుంచీ.. కమ్యూనిష్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి....
కడప జిల్లా లో మారుమూల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, బాల్యంలోనే ఆనేక ఛీదరింపు ల ను ఎదుర్కొని, కూలి పనుల కెళ్ళి కడుపు నింపుకొని, అనాధ బడులలో చదువుకుంటూ ..పేదరికాన్ని అతి దగ్గరనుంచి చూచి,అనుభవించిన ఈశ్వరయ్య నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవ్వడం నేటి యువతరానికి, సీపీఐ రాష్ట్ర కార్యకర్తలకు , రాష్ట్ర పేద ప్రజానీకానికి ఒక గర్వకారణం...యువతకు ఆయన ఉద్యమ జీవితం ఒక ఆదర్శం.!! బడుగు, బలహీన వర్గాల వారి పక్షాన నిలిచి..రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలకు సమాయత్తం అవుతారని ఆశిద్దాం .... అందుకు ఆయనకు మరొక్క సారి " విప్లవ అభినందనలు" తెలియజెద్దాం !!
*ఎం సాయి కుమార్,
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
9133638567*