
వారికి బెయిల్ ష్యూరిటీ ప్రభుత్వం చెల్లించాలి...: సుప్రీం కోర్టు
దేశంలో జైళ్లలో మగ్గిపోతున్న విచారణలో ఉన్న పేద ఖైదీలకు సుప్రీం కోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన నిందితులు బెయిల్ మంజూరు అయినప్పటికీ డబ్బులు లేక బెయిల్ బాండ్లు సమర్పించలేకపోవడంతో జైలులోనే ఉండిపోతున్న నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం కీలక నిర్ణయం వెలువరించింది
ఏదైనా నేరం చేసి ఒక పేద వ్యక్తి అరెస్ట్ అయి, విచారణ ఖైదీగా జైలులో ఉండి బెయిల్ కోసం ష్యూరిటీ మొత్తం సమర్పించలేని పరిస్థితిలో ఉంటే... సంబంధిత ప్రభుత్వం జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా విడుదలకు అవసరమైన మొత్తాన్ని అందించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు ఒక ప్రత్యేకమైన ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్‌వోపీ)రూపొందించింది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు చేసింది. అమికస్ క్యూరీ సూచనలను చేర్చిన తర్వాత సుప్రీంకోర్టు కొత్త ఎస్‌వోపీ రూపొందించింది.
వేలాది మంది విచారణలో ఉన్న ఖైదీలు బెయిల్ మంజూరు అయినప్పటికీ... బెయిల్ బాండ్లను సమర్పించకపోవడం (ష్యూరిటీతో కూడిన, షూరిటీ లేకపోయిన) వల్లే జైలులో మగ్గుతున్నారని తెలుసుకున్న సుప్రీం ధర్మాసనం... ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుంది. అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సూచనలను చేర్చిన తర్వాత న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్‌సీ శర్మల ధర్మాసనం కొత్త ఈ కొత్త ఎస్‌వోపీని సిద్దం చేసింది.
జిల్లా న్యాయ సేవల సంస్థ (డీఎల్ఎస్‌ఏ) రూ. లక్ష వరకు పూచీకత్తు మొత్తాన్ని సమర్పించవచ్చని... అయితే ట్రయల్ కోర్టు సమర్పించాల్సిన ష్యూరిటీ రూ. 1 లక్ష కంటే ఎక్కువగా నిర్ణయించినట్లయితే, ఆ మొత్తాన్ని తగ్గించడానికి దరఖాస్తును దాఖలు చేయాలని ధర్మాసనం పేర్కొంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం... ఎవరైనా విచారణలో ఉన్న ఖైదీకి బెయిల్ మంజూరు అయినప్పటికీ ఏడు రోజుల్లోపు జైలు నుండి విడుదల కాకపోతే, జైలు అధికారులు డీఎల్ఎస్‌ఏ కార్యదర్శికి తెలియజేయాల్సి ఉంటుంది. దీంతో డీఎల్ఎస్‌ఏ కార్యదర్శి వెంటనే ఆ ఖైదీ సేవింగ్స్ అకౌంట్‌లో నిధులు ఉన్నాయో లేదో ధ్రువీకరించడానికి ఒక వ్యక్తిని నియమిస్తారు. అయితే నిందితుడి వద్ద డబ్బు లేనట్టుగా తేలితే... జిల్లా స్థాయి సాధికార కమిటీ నివేదిక అందిన తేదీ నుంచి ఐదు రోజుల వ్యవధిలోపు డీఎల్ఎస్ఏ సిఫార్సుపై పూచీకత్తు కోసం నిధులను విడుదల చేయమని నిర్దేశిస్తుంది.
''విచారణలో ఉన్న ఖైదీకి పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఆర్థిక సహాయం ప్రయోజనాన్ని అందించాని సాధికార కమిటీ సిఫార్సు చేసిన కేసులకు, ఒక ఖైదీకి రూ. 50,000 వరకు అవసరమైన మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా ఏదైనా ఇతర సూచించిన పద్ధతి ద్వారా డ్రా చేసి సంబంధిత కోర్టుకు అందుబాటులో ఉంచాలని ఆదేశించవచ్చు'' అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.