logo

"సిల్వర్ జూబిలీ" జరుపుకున్న "స్వర బృందావనం"

27-09-2025 న కళాభారతి సిటీ కల్చరల్ సెంటర్ హైదరాబాదు నందు అలుపెరుగని మహా యోధులు శ్రీ బృందావనం రవికాంత్ మరియు శ్రీ తూములూరి శ్రీకుమార్ ల పర్యవేక్షణ లో "మేజిక్ బ్యానర్" "స్వర బృందావనం" 25 వ సినీ సంగీత విభావరి "సిల్వర్ జూబిలీ" సగర్వంగా నిర్వహింపబడినది. 2024 ఆగష్టు15 న చిన్నగా మొదలైన స్వర బృందావనం 2025 ఆగష్టు 24 న, 24 వ సంగీత విభావరి తో "ప్రథమ వార్షికోత్సవం" జరుపుకొని, నేడు 25 వ విభావరి తో "సిల్వర్ జూబిలీ" స్థాయికి అత్యల్ప సమయంలో చేరినది. విశ్రాంతి నెరుగని నిర్వాహకుల కృషియే ఇందుకు తోడ్పడినది.
దీనికోసం రవికాంత్ ప్రోమోలు, టీజర్లు, లైవ్ ప్రోగ్రాములు నిర్వహించి ఒరవడి సృష్టించారు. వీటన్నిటికీ వందల్లో వ్యూస్ రావడం వ్యక్తిగా రవికాంత్ యొక్క, "మ్యాజిక్ బ్యానర్" గా స్వర బృందావనం యొక్క ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ కృషి సిల్వర్ జూబిలీ కార్యక్రమంలో ప్రతిఫలించినది. నేడు ఈ ఒరవడిని కొంతమంది అనుసరిస్తున్నారు.
ఉదయం 10 గంటలకు ప్రారంభమైన "సిల్వర్ జూబిలీ" సంగీత విభావరి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా సాగి ప్రేక్షకుల ప్రశంస లందుకొన్నది. ప్రకృతి కూడ వీరికి సహకరించినది. ముందురోజు వరకు ఎడతెరిపి లేని వానలతో బీభత్సం సృష్టించిన ప్రకృతి 27 వ తేదీన ప్రశాంతంగా ఉండి, గాయనీ గాయకుల రాకపోకలకు, నిర్వాహకుల సక్రమ నిర్వహణకు పూర్తిగా సహకరించినది.
ఉదయం 10 గంటలకు రాంబాబు "శుక్లాంబరధరం" శ్లోకం తోను, రఘుబాబు "జయ జయ శుభకర వినాయక" అనే పాట తోను శుభారంభం గావింపబడిన "సిల్వర్ జూబిలీ" కార్యక్రమం భక్తి, సంగీత, ఆలోచన, శ్రావ్య, హుషారు మొదలైన నవ రసాల గీతాలతో అద్భుతమైన గాయనీ గాయకుల చే ప్రత్యక్ష పరోక్ష ప్రేక్షకుల నందరినీ మంత్రముగ్ధులను చేసినది.
రవికాంత్ గారి ఆలోచన లు, సేవలు, కార్యాచరణ, యాంకరింగ్, ఆదరణ అత్యంత ప్రశంసనీయమని ప్రేక్షకులే కాక గాయనీ గాయకులు కూడ వేనోళ్ల కీర్తించారు. విజయం సాధించాలంటే ఇవన్నీ అవసరమని, రవికాంత్ లో పుష్కలంగా ఉండడం వలననే అతి తక్కువ సమయంలో స్వర బృందావనం "సిల్వర్ జూబిలీ" జరుపుకుందని, అతి త్వరలో "డైమండ్ జూబిలీ" జరుపుకోవాలని అందరూ ప్రశంసించి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ శ్రీమతి కప్పగంతు శ్రీలక్ష్మి రుచికరమైన భోజనం ఏర్పాటుచేయగా, శ్రీ తూములూరి శ్రీకుమార్ తండ్రి గారు శ్రీ తూములూరి మధుసూధనరావు గారు జ్ఞాపిక లను ఏర్పాటుచేసి అందరినీ ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాదు వారే కాక భువనేశ్వర్, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి మొదలైన సుదూర ప్రాంతాల నుంచి శ్రీయుతులు రవికాంత్, శ్రీకుమార్, నాగేశ్వరరావు, వెంకట రమణమూర్తి, రఘుబాబు, శరత్ కృష్ణ, విజయ భరత్, వేదవ్యాస్, సీతాపతి శర్మ, విజయరాఘవన్, బ్రహ్మానందం ప్రభృతులు, మరియు శ్రీమతులు సీత, సీతాకుమారి, రమాదేవి, యశోద, శ్రీలక్ష్మి, రవిలక్ష్మి, అభిమైత్రి, వసుధ ప్రభృతులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
సాయంత్రం 6 గంటలకు శ్రీ తూములూరి మధుసూదనరావు గారి జ్ఞాపిక బహూకరణ అనంతరం గాయనీ గాయకుల "జనగణమన" తో అత్యంత వైభవంగా కార్యక్రమం ముగిసింది.

80
959 views