logo

*పాపం...YSRCP ఎమ్మెల్యేలు...అధ్యక్షుడికి చెప్పలేరు...అసెంబ్లీకి వెళ్లలేరు...!*



శాసనసభకు ఎన్నికవ్వడం ఎవరికైనా రాజకీయ పయనంలో ఓ కీలక
మలుపు...

శాసనసభలో అడుగుపెట్టడం... ఓ అనుభూతి... అరుదైన అవకాశం...! అసెంబ్లీలో గొంతెత్తడం... తనను ఎన్నుకున్న ప్రజల గొంతుకలకు
ప్రాణం ఇవ్వడం...

కానీ...ఇక్కడ సభకు ఎన్నికైన సభ్యులు అసెంబ్లీలో అడుగుపెట్టడం లేదు. అధ్యక్షా... అంటూ తమ ప్రజల గోడును వినిపించడం లేదు. ఇది వారికై వారు తీసుకున్న నిర్ణయమా...లేక రాజకీయ క్రీడలో పావులుగా మారిన వైనమా...?

Yes...ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికైన ఆ 11మంది గురించే చెప్పేది. అసెంబ్లీలోకి అడుగుపెట్టకూడదు అన్నది ఆ 11మంది నిర్ణయమా...లేక అందులో ఒకరి నిర్ణయానికి మిగతా 10మంది కట్టుబుడిపోయి ఉండాల్సిన పరిస్థితా...?

మాజీ ముఖ్యమంత్రి , YSRCP అధ్యక్షుడు జగన్ మోహనరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కాకుండా...మరో 10మంది ఆ పార్టీ తరపున గెలిచారు...

• పులివెందుల – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

• పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

• తంబళ్లపల్లి – పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి.

• మంత్రాలయం – వై. బాలనాగిరెడ్డి.

• రాజంపేట – ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి.

• బద్వేలు – దాసరి సుధ.

• ఆలూరు – విరూపాక్షి.

• యర్రగొండపాలెం – తాటిపత్రి చంద్రశేఖర్.

• దర్శి – బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి.

• అరకు – రేగం మత్స్యలింగం.

• పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వరరాజు.

జగన్ మోహనరెడ్డి తన రాజకీయం కోసం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలను...ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ప్రతినిధులను చట్టసభలకు వెళ్లనీయకుండా చేస్తున్నారని విమర్శ ఉంది. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి అసెంబ్లీకి రాకపోవడమే తప్పైతే...దానిని సమర్థించుకోవడమే కాకుండా...మిగిలిన ఎమ్మెల్యేలను కూడా రానివ్వకపోవడం ఎంత వరకూ సమంజసమన్న ప్రశ్న వస్తోంది. చాలామంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ నిర్ణయాన్ని తప్పు పట్టారు. అసలు జగన్ వెళ్లకపోవడమే తప్పైతే... మిగిలిన వాళ్లని కూడా నియంత్రించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కానీ జగన్‌మోహనరెడ్డి దగ్గర ప్రశ్నలకు స్కోప్ తక్కువ. ఆయన చెప్పింది చేయడం మాత్రమే ఉంటుంది...

ఎవరైనా యుద్ధంలోనో... పందెంలోనో గెలిచి తాము అనుకున్నది సాధించుకోవాలి. కానీ ఆయన మాత్రం నేను పార్టిసిపేట్ చేశా...కాబట్టి నాకు ఏదో ఒకటి ఇవ్వాలి అంటున్నారు. అంతెందుకు ఇదే పరిస్థితి తెలుగుదేశానికి వచ్చి ఉంటే జగన్ మోహనరెడ్డి ఏం చేసి ఉండేవారు అన్నది ప్రతి ఒక్కరికీ తెలుసు. నూటికి నూరుశాతం ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఒప్పుకోరు అన్నది రాజకీయాలపై కనీస అవగాహన ఉన్నవారేవరికైనా అవగతమయ్యే విషయం. దీనికి రుజువు కావాలంటే... జగన్ మోహనరెడ్డే ఇచ్చారు చూసుకోండి. అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం మాట్లాడారో వింటే... ప్రతిపక్ష హోదా విషయంలో ఆయన వైఖరి ఏంటన్నది అర్థం అవుతుంది...

అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి...?

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గుర్తింపుకోసం ఎలాంటి చట్టం నిబంధనలు లేవు. పార్లమెంట్‌లో పాటించే ప్రొసీజర్‌నే ఇక్కడా అనుసరిస్తారు. ప్రతిపక్షనేత హోదాను గుర్తించడానికి ముందు మూడు అంశాలు చూడాలి...

1. 1951 పార్లమెంట్ యాక్ట్ (Representation of the People Act, 1951) ఈ యాక్ట్ ప్రధానంగా ఎన్నికల నిర్వహణ, పార్లమెంట్ సభ్యత్వ అర్హత/అనర్హతలు, ఉపఎన్నికలు, ఎన్నికల ప్రక్రియ వంటి విషయాలను మాత్రమే వివరిస్తుంది. ఇందులో ప్రతిపక్ష పార్టీ/ Leader of Opposition (LoP) అనే కాన్సెప్ట్, గైడ్‌లైన్స్ స్పష్టంగా లేవు.

2. Leader of Opposition గుర్తింపు చట్టం:, 1977లో The Salary and Allowances of Leaders of Opposition in Parliament Act అనే ప్రత్యేక చట్టం వచ్చింది. దీని ప్రకారం. "Leader of Opposition" అంటే:

అధికారపార్టీ తప్ప మిగిలిన పార్టీలలో, రెండు సభల్లోనూ (Lok Sabha లేదా Rajya Sabha), అత్యధిక సభ్యులు కలిగి ఉన్న పార్టీకి నేత. అతనిని ఆ సభ స్పీకర్ (లేదా చైర్మన్) “Leader of Opposition”గా గుర్తించాలి.

కానీ ఆ పార్టీకి మొత్తం సీట్లలో కనీసం 1/10 వంతు (10%) సీట్లు ఉండాలి...

3. ఎందుకు 10% రూల్ వచ్చింది?

• 1951 యాక్ట్‌లో అయినా... 1977 చట్టంలో అయినా... 10% అన్న మాట లేదు.

• కానీ G.V. Mavalankar (First Lok Sabha Speaker, 1952) అప్పట్లో ఒక రూలింగ్ ఇచ్చారు... “ఏ పార్టీని Parliamentary Party గా పరిగణించాలంటే, ఆ సభ మొత్తం సీట్లలో కనీసం 1/10 (10%) సీట్లు ఉండాలి." తర్వాతి స్పీకర్లు కూడా ఈ రూల్‌ని కొనసాగించారు...

కాబట్టి ఆ చట్టం + స్పీకర్ రూలింగ్ ప్రకారం → 10% రూల్ ఫాలో అవుతున్నారు. అందుకే జగన్ పార్టీకి కూడా 10% సీట్లు లేకపోవడంతో అధికారికంగా ప్రతిపక్ష హోదా రాలేదు...

అసెంబ్లీ నిబంధనలు (Rules of Procedure, A.P. Legislative Assembly) ప్రకారం...

సభ్యుడు అసెంబ్లీకి రాలేకపోతే, సెషన్ ప్రారంభంలో లేదా మధ్యలో స్పీకర్‌కి అప్లికేషన్ ఇవ్వాలి. స్పీకర్ ఆ అప్లికేషన్‌ను సభ ముందు పెడతారు. సభ ఓటుతో ఆ గైర్హాజరును అప్రూవ్ చేస్తే అది “లీవ్ ఆఫ్ యాబ్సెన్స్”. ఒకసారి లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ ఇచ్చిన తర్వాత, ఆ రోజులు 60 రోజుల లెక్కలోకి రావు. ఇవన్నీ చేయకుండా వరుసగా 60 రోజులు ( శాసనసభ జరిగిన రోజులు) గైర్హాజరైతే... ఆటోమేటిగ్‌గా ఆ సీటు ఖాళీ అయిపోతుంది. అయితే ఇందులో కూడా స్పీకర్‌దే ఫైనల్ నిర్ణయం. అలా ఆ సీటు ఖాళీ అయిందని ఆయన నోటిఫికేషన్‌ ఇస్తేనే అది అమలవుతుంది. ఇంకో సెషన్‌కు జగన్‌ సహా...YSRCP ఎమ్మెల్యేలు గైర్హాజరైతే... వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించేయొచ్చు...

జగన్‌కు అంటే చంద్రబాబును ఎదిరించాలనో...లేక తనకు ఉండే మొండి పట్టుదలో ఏదో ఒక కారణం ఉంది. కానీ... ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేశారు. వాళ్లని ఎందుకిలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్లలో నలుగురు మొట్టమొదటి సారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారే... తమ సీట్లో కూర్చుని కనీసం ఒక్కసారైనా అధ్యక్షా... అని అనాలని వాళ్లకు ఉండదా...వాళ్లు గొంత నొక్కడం ఏమాత్రం సమజసం...?

0
0 views