logo

భూ సేకరణ ప్రక్రియలోని పెండింగ్ అంశాలను వేగవంతంగా పరిష్కరించండి: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా*

నంద్యాల రిపోర్టర్/ మోహన్ (AIMA MEDIA): నంద్యాల జిల్లాలో వివిధ పరిశ్రమలు, విద్యాసంస్థలు, సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి. విష్ణుచరణ్, డిఆర్ఓ, ఆర్డీఓలు, సంబంధిత మండల తహసీల్దార్లు, తదితర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణలో భూసేకరణ ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో రైతులు, అసైన్‌దారులతో సమన్వయం చేసుకొని స్పష్టమైన నివేదికలు పంపాలని జాయింట్ కలెక్టర్, సంబంధిత రెవిన్యూ అధికారులను ఆమె ఆదేశించారు.ఇప్పటి వరకు జిల్లాలో కుసుం ప్రాజెక్టు కోసం మిడ్తూరులో 162 ఎకరాలు, కంప్రెష్డ్ బయోగ్యాస్ ప్రాజెక్టుల కోసం రుద్రవరం, చాగలమరి, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో కలిపి 315 ఎకరాలు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం డోన్, బేతంచర్లలో 2,860 ఎకరాలు, ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు కోసం సుగాలిమెట్టలో 49 ఎకరాలను కేటాయించినట్లు తెలిపారు.జిల్లాలో భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించి, పెట్టుబడులు, పరిశ్రమలు సజావుగా సాగేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు. పరిశ్రమలతో పాటు విద్యా, సంక్షేమ రంగాలు ముందుకు సాగాలంటే సమయపాలనతో, సమన్వయంతో అధికారులు పనిచేయాలని ఆమె పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, నాగజ్యోతి, సంబంధిత మండల తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

3
36 views