ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని బలగ కూడలి వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఒక ఆటో డ్రైవర్ దాడికి పాల్పడినట్లు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు బుధవారం తెలియజేశారు. బలగకు చెందిన చిట్టి రాజు ఆర్టీసీలో ఒప్పంద ఉద్యోగిగా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి బుధవారం బత్తిలి వెళ్లేందుకు బస్సు తీశాడు. సరిగ్గా బలగ - రిమ్స్ కూడలికి వచ్చేసరికి వెనుకగా వస్తున్న ఒక ఆటో డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ల వద్ద అదుపు చేయలేక బస్సును ఢీకొట్టాడు. ఆటో నుంచి తక్షణమే దిగిన డ్రైవర్ ఎండపల్లి వసంతరావు బస్సు సడన్‌గా బ్రేక్ వేయడం వలనే ఢీకొన్నానని అంటూ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి దిగాడు. దీంతో ఆర్టీసీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.