logo

వరిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి: ఏఓ పవన్ కుమార్.

నంద్యాల జిల్లా /బండి ఆత్మకూరు (AIMA MEDIA ): బండి ఆత్మకూరు మండలం కడమలకాలువ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ఖరీఫ్ 2025న సాగు చేసిన పంటలు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని, ప్రస్తుతం వరి పంట పిలక నుండి ఈనె దశలో ఉన్నందున ఆకుముడత కాండం తొలుచు పురుగు ఆశించిందని రైతులు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టి పురుగు ఉధృతి నివారించాలని రైతులను కోరారు.పురుగు ఉధృతిని గమనించి దీపపు ఎరలు, సోలార్ దీపపు ఎర లేదా లింగార్షక బుట్టలు అమర్చుకోవాలని తెలిపారు. ఎరలతో పురుగులు బుట్టల్లో పడి పోతాయని పేర్కొన్నారు. పిలక దశలో ఎకరాకు మూడు లింగార్షక బుట్టలు పెట్టి అందులో వారానికి 25 నుంచి 30 పురుగులు పడినప్పుడు సస్యరక్షణ చేపట్టాలని సూచించారు. ప్రారంభ దశలోనే కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు లేదా పిప్రోనిల్ గుళికలు చల్లాలని తెలిపారు. 15రోజుల పిలక దశలోనైతే ఎకరాకు కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలు 10కిలోలు చల్లాలని, లేదా కార్టాప్ఫైడ్రాక్లోరైడ్, పిప్రోనిల్ గుళికలను ఇసుకలో కలిపి చల్లాలని పేర్కొన్నారు. చిరు పొట్ట దశలో పురుగు ఉన్నట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా క్లోరాంట్రానిలిప్రోల్ ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు.వరి ప్రధాన పంటలో ఎరువులను మోతాదుకు మించి వాడరాదని, ఎకరాకు 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాష్ లను ఇచ్చే ఎరువులను వేసుకోవాలని తెలిపారు. అలాగే నానో యూరియా మరియు నానో డి.ఏ.పి ఎరువుల వాడుక వలన పర్యావరణ మరియు భూమి కాలుష్యం తగ్గించి నాణ్యమైన దిగుబడులు పొందగలరని ఏఓ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవోతో పాటు వ్యవసాయ విస్తరణ సిబ్బంది లక్ష్మయ్య నాగార్జున రెడ్డి వైస్ ఎంపీపీ రాగాల రమణ పలువురు రైతులు పాల్గొన్నారు.

0
0 views