logo

అల్లూరి జిల్లలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల్లో అత్యంత పారదర్శకత తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం సాంకేతికతను జోడిస్తుందని దానికి సాక్ష్యమే స్మార్ట్ రేషన్ కార్డులని తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర అన్నారు. అరకులోయ శనివారం క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దొన్నుదొర మాట్లాడుతూ టెక్నాలజీని అభివృద్ధి పరచడంలోనూ... దాన్ని ఉపయోగించడంలోని చంద్రబాబు నాయుడు గారిని మించిన వారు ఉండరన్నారు. కానీ అతనికి మించిన విధంగా సాంకేతికతను ఉపయోగించడంలో లోకేష్ ఒక అడుగు ముందుంటున్నారన్నారు. ఐటీ శాఖ మాత్యులుగా ఉంటూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో పారదర్శకత తీసుకురావడం కోసం వాటికి సాంకేతికతను జోడిస్తున్నారన్నారు.
స్మార్ట్ రేషన్ కార్డ్ ద్వారా మనం మన రేషన్ సరుకులను రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ వద్ద అయినా తీసుకోవచ్చని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు.
అల్లూరి జిల్లలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మన అరకులోయ పెదలబుడు పంచాయతీ నుండే ప్రారంభిస్తున్నామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లలో దాదాపు 2.95 లక్షల రేషన్ కార్డ్ లను స్మార్ట్ కార్డులుగా మార్చడం జరిగిందని కలెక్టర్ వివరించారు.
మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డ్ వలన మనం రాష్ట్రంలో ఏ రేషన్ షాప్ వద్ద అయినా నిత్యావసర సరుకులు తీసుకోవచ్చని, మనం ఎప్పుడు ఎక్కడ ఏఏ నిత్యావసర సరుకులు తీసుకున్నామో ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ ను స్కాన్ చేయడం వలన మనకు తెలుస్తుందని స్మార్ట్ రేషన్ కార్డ్ ఉపయోగాలు వివరించారు. అలాగే మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ తీసుకురావటం వలన సుమారు 300రకాల ప్రభుత్వ సేవలను ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళకుండానే పొందుతున్నామని మంత్రి పేర్కొంటూ ఇందుకు కారణమైన రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు, ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు పొందటం సులభతరం చేసినందుకు కృతఙ్ఞతలు మంత్రి తెలిపారు.
రాష్ట్రం లో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి పేర్కొన్నారు. కావున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు స్వీప్ చేయాలని, ప్రజలు కూటమి పార్టీలను ఆదరించాలని మంత్రి సూచించారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎన్నో కుటుంబాలు లాభ పడ్డాయని, కొన్ని కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు వస్తుండటం చాలా సంతోషంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, పాడేరు టీడీపీ ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఐటీడీఏ ఇంచార్జ్ పీఓ డా.అభిషేక్, సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పాటిల్, అసిస్టెంట్ కలెక్టర్, కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0
24 views