logo

రేవంత్ వ్యాఖ్యలతో టీడీపీ ఫ్యాన్స్ హర్టు

రేవంత్ రెడ్డి ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రెండేళ్ల కిందట తెలంగాణలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. అయినా సరే రేవంత్ అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులకు ప్రత్యేక అభిమానం. పార్టీ మారినా సరే.. ఆయనకు మద్దతుగానే నిలుస్తూ వచ్చారు. తెలంగాణలో టీడీపీ ఫ్యాన్స్‌లో చాలామంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవడానికి రేవంత్ కారణం అనడంలో సందేహం లేదు. కాంగ్రెస్‌లోకి వెళ్లాక కూడా తన రాజకీయ గురువు అయిన చంద్రబాబు మీద తన అభిమానాన్ని చాటుకుంటూనే వస్తున్నారు రేవంత్. అలాంటి వ్యక్తి తాజాగా ఏపీ రాజధాని అమరావతి గురించి.. చంద్రబాబు, లోకేష్‌ల గురించి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఫ్యాన్స్‌కు రుచించడం లేదు. రేవంత్ మీద ఎన్నడూ లేని విధంగా వ్యతిరేకత కనిపిస్తోంది ఈ వ్యాఖ్యల వల్ల.

ఏపీతో పోటీ గురించి ఈ ఇంటర్వ్యూలో రేవంత్‌కు ప్రశ్న ఎదురైంది. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో ఏపీ ప్రగతి పథం వైపు వెళ్తుండడం, అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు ఇస్తుండడం గురించి ప్రస్తావిస్తే.. ఏపీ, ఆ రాష్ట్ర రాజధాని తమకు పోటీయే కాదని రేవంత్ వ్యాఖ్యానించారు. తన చేతిలో హైదరాబాద్ ఉందని.. అది పెద్ద ప్లస్ అని.. కానీ అమరావతి ఏపీకి భారమే అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుందని.. అమరావతిలో అలాంటి పరిస్థితి ఉందని.. ఆ ప్రాంతానికి వరద ముప్పు ఉందని రేవంత్ అన్నారు. ఇక తాను రాజకీయాల్లో సరైన వయసులో ఉన్నానని.. చంద్రబాబు మరీ సీనియర్ అని, నారా లోకేష్ మరీ జూనియర్ అని రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ.. టీడీపీ మద్దతుదారులకు ఇవి రుచించడం లేదు. హైదరాబాద్‌కు ఎంత ఎలివేషన్ ఇచ్చుకున్నా పర్వలేదని.. అమరావతి మీద ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్‌ల గురించి చేసిన కామెంట్లను కూడా తప్పుబడుతున్నారు.

5
718 views