logo

ఆ ఆలయంలో అమ్మవారు నిజంగానే సజీవంగా ఉందా

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పుణ్యక్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం. భక్తులు మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా అమ్మవార్లను దర్శించుకోవడానికి ఇక్కడకు అధికంగా తరలి వస్తారు.
పురాణాల ప్రకారం శ్రీశైలం క్షేత్రానికి ఉన్న ప్రాధాన్యం అనిర్వచనీయమైనది. ఉత్తర భారతంలో కాశీ, ఉజ్జయిని వంటి క్షేత్రాల తరువాత, దక్షిణ భారతంలో అన్ని ఆరాధనా పద్ధతులు కలిసే క్షేత్రం శ్రీశైలమే.

వేద సంప్రదాయ పూజల నుండి కాపాలికుల తంత్ర పూజల వరకు ఇక్కడ అనేక రకాల పూజలు, ఆరాధనలు జరుగుతాయి. నల్లమల అడవుల్లో అనేక శివలింగాల క్షేత్రాలు దాగి ఉన్నాయి అని స్థానికులు చెబుతారు. అయితే ఆ క్షేత్రానికి చేరుకోవడం, దర్శనం చేసుకోవడం మాత్రం కష్టసాధ్యం అంటుంటారు. పల్లవులు, విజయనగర రాజుల కాలంలో ఈ క్షేత్రం విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడే కొద్దిమందికే తెలిసిన, ఎంతో విశేషమైన ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది.

అమ్మవారి మహిమ.. కోరికలు తీర్చే దేవి..

ఇష్టకామేశ్వరి దేవి ఆలయం భారతదేశంలో మరెక్కడా లేదు. అదృష్టం కలిసి వచ్చిన భక్తులు మాత్రమే ఈ ఆలయానికి చేరి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు అమ్మవారి నుదుటిపై బొట్టు పెట్టి హృదయపూర్వకంగా కోరిక కోరతారు. ఆ సమయంలో అమ్మవారి విగ్రహం మృదువుగా తాకినట్టే అనిపిస్తుంది అని చెబుతారు.

గతంలో అమ్మవారిని సిద్ధులు మాత్రమే పూజించేవారు. ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా అమ్మవారికి పూజలు చేస్తున్నారు. ఇక్కడి అమ్మవారు చతుర్భుజాలతో ఉంటారు. రెండు చేతుల్లో తామర మొగ్గలు, ఒక చేతిలో శివలింగం, మరొక చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్న రూపంలో దేవి దర్శనమిస్తారు. గుహ లాంటి ఆలయంలో దీపాల వెలుగులో అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక శాంతిని కలిగిస్తుంది.

సాహసోపేతమైన ప్రయాణం..

శ్రీశైలం కూడలి నుంచి సుమారు 20 కి.మీ. దూరంలో, దట్టమైన అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది. ఇక్కడికి సాధారణ కార్లు వెళ్లలేవు. సాయంత్రం 5 దాటిన తర్వాత అడవిలోకి వాహనాలు అనుమతించరు. ఎందుకంటే ఆ సమయానికి అడవిలో జంతువులు సంచరిస్తాయి. అయినా శ్రీశైలం వెళ్లే వారు ఈ రహస్య ఆలయాన్ని తప్పక చూసి ఆ మహిమను చూస్తే అది జీవితంలో మరపురాని అనుభూతిగా నిలుస్తుంది.

0
742 views