logo

వివేకా హత్య కేసులో..తదుపరి దర్యాప్తు అవసరమా

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప సెషన్స్‌ కోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్‌ రిపోర్టుపై మీ అభిప్రాయమేంటని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమో కాదో చెప్పాలని కూడా స్పష్టంచేసింది. ఈ హత్య కేసులో నిందితులు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, గంగిరెడ్డి తదితరుల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి, సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం సుప్రీంకోర్టు ముందుకొచ్చాయి. జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం అన్ని పిటిషన్లనూ కలిపి విచారించింది. సునీతారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. అవినాశ్‌రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని, ఆయన బయట ఉంటే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని దర్యాప్తు సంస్థ భావిస్తోందా.. లేదా? రాష్ట్రప్రభుత్వం కడప సెషన్స్‌ కోర్టులో దాఖలుచేసిన క్లోజర్‌ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి? కేసు ట్రయల్‌, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా లేదా..’ అని ప్రశ్నలు సంధించింది. దాని సమాధానాల ఆధారంగా నిందితుల బెయిల్‌ రద్దు పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అలాగే.. బెయిల్‌ రద్దు పిటిషన్లను ట్రయల్‌ కోర్టు పరిశీలించిందా.. లేదా? ఒకవేళ పరిశీలించకుంటే.. వాటిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవలసిందిగా ఆదేశిస్తామని పిటిషనర్లకు ధర్మాసనం స్పష్టంచేసింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.

0
93 views