
సర్పంచ్ ఎన్నికలు వద్దు
- బుగ్గారం ప్రజా క్షేత్రంలో.....
పంచాయతీ లెక్కలు తేల్చండి - ఎన్నికలు నిర్వహించండి
- జిల్లా కలెక్టర్ కు "చుక్క గంగారెడ్డి" విజ్ఞప్తి
సర్పంచ్ ఎన్నికలు వద్దు
- బుగ్గారం ప్రజా క్షేత్రంలో.....
పంచాయతీ లెక్కలు తేల్చండి - ఎన్నికలు నిర్వహించండి
- జిల్లా కలెక్టర్ కు "చుక్క గంగారెడ్డి" విజ్ఞప్తి
జగిత్యాల జిల్లా / బుగ్గారం :
గ్రామ పంచాయతీ లెక్కలు తేల్చి దోషులందరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకునే దాకా బుగ్గారం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించ వద్దని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ కు సీనియర్ ఉద్యమకారుడు, తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞాపన పత్రం అందుకున్న జిల్లా కలెక్టర్ వెంటనే జిల్లా పంచాయతీ అధికారి సి.హెచ్. మదన్ మోహన్ ను పిలుచుకొని ప్రజావాణి వేదికగా తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం చుక్క గంగారెడ్డి విలేఖరులతో మాట్లాడారు. బుగ్గారం గ్రామ పంచాయతీలో కోటికి పైగా నిధులు దుర్వినియోగం అయ్యాయని పేర్కొన్నారు. పంచాయతీ అధికారులు అవినీతికి పాల్పడి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
క్రిమినల్ కేసులు నమోదు చేసి, ప్రత్యేకంగా నిధుల దుర్వినియోగం ను పరిశీలించి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని 2024 డిసెంబర్ 6న లోకాయుక్త జారీ చేసిన ఆర్డర్ ను, 2025 మార్చి 10న జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను కూడా పంచాయతీ అధికారులు తుంగలో త్రొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు.
నియమ నిబంధనలను అనుసరించి సమగ్ర విచారణ చేసి, తగు చర్యలు తీసుకుంటూ నివేదిక సమర్పించాలని 2024 సెప్టెంబర్ 11న అప్పటి అదనపు కలెక్టర్ బి. గౌతమ్ రెడ్డి జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఉత్తర్వులను కూడా భే ఖాతర్ చేశారని ఆరోపించారు.
సమాచార కమీషన్ ఇచ్చిన 18 ఆర్డర్లను, జిల్లా కలెక్టర్ ఆర్టీఐ ఆదేశాలను సైతం జిల్లా పంచాయతీ అధికారులు లెక్క చేయడం లేదన్నారు.
లోకాయుక్త ఆర్డర్ ను జిల్లా కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులను, జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాలను, సమాచార కమీషన్ తీర్పులను కూడా ధిక్కరించి, చట్టాలను, వారి విధులను, వారి బాధ్యతలను కూడా ఉల్లంఘించిన జిల్లా, డివిజనల్, మండల పంచాయతీ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే…, మా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులందరి మీద మా (చుక్క గంగారెడ్డి) పిర్యాదు మేరకే... పోలీస్ అధికారులతో.. "క్రిమినల్ కేసులు" నమోదు చేయించి, దుర్వినియోగమైన ప్రజా ధనం మొత్తం రికవరీ చేయాలని కోరారు. "ప్రత్యేక నిఘా విభాగం" అధికారుల ద్వారా బుగ్గారం ప్రజా క్షేత్రంలో… బహిరంగ సభ ఏర్పాటు చేసి జి.పి. నిధుల లెక్కలు బహిర్గతం చేసి, "తగు కట్టుదిట్టమైన సమగ్ర విచారణ జరిపించి" వాస్తవాలను వెలికి తీసి, పూర్తి దుర్వినియోగాన్ని బయట పెట్టి బాధ్యులందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి పరిస్ధితులు భవిష్యత్ లో మరెక్కడా కూడా జరుగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కు చుక్క గంగారెడ్డి 20 అంశాలతో కూడిన విజ్ఞప్తి చేశారు.
అప్పటి దాకా మా “బుగ్గారం గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు” నిర్వహించ వద్దని ప్రత్యేకంగా తమరిని వేడుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కు అందజేసిన వినతి పత్రం లో చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
లేని పక్షంలో రానున్న ఎన్నికల సమయంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హై కోర్టు ను ఆశ్రయించి "ఎన్నికలపై స్టే ఆర్డర్" తెస్తామని చుక్క గంగారెడ్డి స్పష్టం చేశారు.