
ఖమ్మం పార్లమెంటు సభ్యులుతో పలు సమస్యలపై చర్చిస్తున్న ఉమ్మడి రేగళ్ళ కాంగ్రెస్ నాయకులు
భద్రాద్రి జిల్లా బ్యూరో (జూలై 01) ఖమ్మం ఎంపి రామసహాయం రఘురామ్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్ష్మిదేవిపల్లి మండలం బంగారుచెలక, మైలారం, గట్టుమల్ల, రేగళ్ళ, లక్ష్మిదేవిపల్లి, చాతకొండ, సీతారాంపురం, తెలగ రామవరం, హేమచంద్రాపురం ఉమ్మడి పంచాయతీల పరిధిలో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో రేగళ్ళలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘు రామ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తూము చౌదరి, పెద్దబాబులతో కలిసి పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఎంపీకి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, వార్డు సభ్యులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. 10ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు ఎలా బుద్ధి చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం ఇచ్చారో అదే రీతిలో స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు పలికిన వారిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.22 వేల కోట్లతో రైతు భరోసాను అమలు చేసిందని, రూ. 12వేల కోట్లతో పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తోందని, 55 లక్షల ఇండ్లకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఉచిత బస్సు పథకానికి 4 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గతంలో పదేళ్లు ఉన్న బీఆర్ఎస్ సర్కారు హయాంలో చేసిందేమీ లేదని.. కుంగిన, కూలిన కాళేశ్వరం, దరిద్రమైన ధరణి మాత్రమే కనిపిస్తున్నాయని విమర్శించారు. ఈ సందర్భంగా ఉమ్మడి రేగళ్ళ గ్రామ పంచాయతీలోని పలు సమస్యలపై జిల్లా నాయకులు, మండల నాయకులు ధారావత్ దుబాలో నాయక్, అజ్మీరా మోహన్, భూక్యా సీతారాం, ధారావత్ రమేష్, నూనావత్ రమేష్, ధారావత్ బిక్కులాల్ మాట్లాడుతూ... ఉమ్మడి రేగళ్ళలోని పెద్ద తండా నుండి గాజులగూడెం రైల్వే స్టేషన్ వరకు తారు రోడ్డు, గట్టుమల్ల నుండి మున్య తండా వరకు తారు రోడ్డు, పెద్ద తండాలో మెయిన్ రోడ్డుకు డ్రైనెజి మంజూరి చేయుట, పెద్ద తండాలో గ్రామ పంచాయతీ ఆఫీస్ నిర్మించుట గురించి చర్చించటం జరిగింది.