logo

వచ్చే నెల 2వ వారంలో సింగరేణి థర్మల్ ప్లాంట్కు శంకుస్థాపన రాజస్థాన్ తో ఒప్పందంలో భాగంగా ఏర్పాట్లు త్వరలో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు, ఎండీ నియామకం పూర్తి రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ హీరాలాల్ నగర్ తో భేటీ సింగరేణి - ఆర్ వి ఎన్ ఎల్ ఒప్పందం ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనం:డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు

దేశంలో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అత్యంత కీలకమని, ఇందుకు తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి, రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ మధ్య ఇటీవల జరిగిన 3100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు ఒప్పందమే గొప్ప నిదర్శనమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. తెలంగాణ- రాజస్థాన్ మధ్య గతంలో చేసుకున్న సోలార్, థర్మల్ విద్యుత్ ఒప్పందాలను ముందుకు తీసుకువెళ్లే క్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాజస్థాన్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ హీరాలాల్ నగర్ తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు.
తెలంగాణ, రాజస్థాన్ ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగిన ఒప్పందం ఫెడరల్ స్ఫూర్తికి గొప్ప నిదర్శనమని పేర్కొంటూ దీన్ని వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లేలా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు. ముఖ్యంగా ఒప్పందంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పనున్న 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లలో ఒకటైన సింగరేణి 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణపు పనులకు వచ్చే నెల రెండో వారంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఈ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బీహెచ్ ఈ ఎల్కు అప్పగించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే 3100 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇరు కంపెనీలు సంయుక్త భాగస్వామ్య కంపెనీని నెలకొల్పడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు.
అలాగే రాజస్థాన్ లో ఏర్పాటు చేయనున్న 1500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల కోసం భూ పరిశీలన ఒక సారి పూర్తయిందని, మరో సారి అధికారుల బృందం అక్కడికి వెళ్లి ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఇరు రాష్ట్రాల్లోని భౌగోళిక పరిస్థితులను గొప్ప అవకాశంగా మార్చుకోవడానికి చేసుకున్న ఈ ఒప్పందంలో పేర్కొన్న విధంగా విద్యుత్ ప్లాంట్లను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయడం ద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో హరిత ఇంధన ఉత్పత్తి దిశగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోందని, 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్న విషయాన్ని ప్రస్తావించారు.
ఇరు రాష్ట్రాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టుపై మంచి పురోగతి ఉండటంపై రాజస్థాన్ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ హీరాలాల్ నగర్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ ఒప్పందం అమలులో భాగంగా ఆర్ వి యూ ఎన్ ఎల్ నుంచి కూడా సమన్వయ అధికారులను నియమించినట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ రామకృష్ణారావు, రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ శ్రీ ఎన్.బలరామ్, సింగరేణి డైరెక్టర్లు, రాజస్థాన్ ఆర్ వి యూ ఎన్ ఎల్ చీఫ్ ఇంజినీర్ శ్రీ వి.పి గార్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

13
1164 views