logo

ఉపాధి హామీ పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించి కూలీలను ఆదుకోవాలి...*


*ఉపాధి హామీపథకంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయండి...*
**
*అధికారపార్టీ నాయకుల మాట విని ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ, అవినీతి, అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు రానున్న రోజుల్లో ఎక్కడున్నా తప్పించు కోలేరు..*
**
*వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి హెచ్చరిక*

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించి కూలీలను ఆదుకోవాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించి, వలసలు నివారించాలన్న ఉద్దేశ్యంతో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నాలుగు మాసాలుగా కూలీలకు బిల్లులు చెల్లించకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దినసరి కూలీతో జీవనం సాగిస్తున్న కూలీలకు నెలల తరబడి డబ్బులు చెల్లించకపోవడంతో వారి జీవనం దుర్లభంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందక, వ్యవసాయ కూలీ పనులు సక్రమంగా దొరక్క పోవడంతో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు బిల్లులు చెల్లించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. వలసలు నివారించడానికే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. అయితే ఉపాధి హామీ పథకంలో అధికారులు వివక్ష చూపుతున్నారని, జాబ్ కార్డులు తీసేస్తామని రాజకీయ కోణంలో అధికారులు మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ విషయంపై అధికారులు పద్ధతులు మార్చుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకుల మాటలకు తలోగ్గిన అధికారులు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. అవినీతి, అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు రానున్న రోజుల్లో ఎక్కడున్నా తప్పించు కోలేరని
ఆయన హెచ్చరించారు. జరుగుతున్న ప్రతి పనిపై ఆరా తీస్తున్నామని, వీడియోలు ఇతర ఆధారాలతో సహా సేకరిస్తున్నామన్నారు.నాలుగేళ్ళ తరువాత అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించి ఖచ్చితంగా రికవరీ చేయించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.
అవినీతిని ప్రోత్సహిస్తున్న అధికారులు ఇకనైనా జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు. ఉపాధి హామీ చట్టంపై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. ఈ పథకంలో ప్రతి చోట, ప్రతిరోజూ జరుగుతున్న పనులలో భారీగా అవకతవకలు జరుగు చున్నాయని, ప్రభుత్వ సొమ్మును దోచుకు తింటున్నారని ఆయన ఆరోపించారు. కూలీలు చేయవలసిన పనులను యంత్రాలతో చేస్తున్నారని, ఊర్లలో లేని వ్యక్తుల పేర్లను మస్టర్లలో నమోదు చేయడం, చేసిన పనులకే తిరిగి మెరుగులు దిద్ది , బెదిరించుకుని బిల్లులు చేయించుకుంటున్నారన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద వీడియోలతో సహా ప్రాంతాల వారీగా, తేదీల వారీగా ఆధారాలు ఉన్నాయన్నారు. ఇతర పార్టీల వారికి ఉపాధి పనులు కల్పించమని దౌర్భాగ్యపు పరిస్థితులు నేడు తీసుకువచ్చారన్నారు.నామమాత్రంగా సామాజిక తనిఖీలు చేసి మ.మ అని పూర్తి చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారం ఉందని మీరు చెప్పినట్లే సామాజిక తనిఖీలు ఉండేలా చేసుకుంటున్నారన్నారు. అవినీతి, అక్రమాలు జరగకుండా చూసి, పథక లక్ష్యాలను సాధించేలా ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఉపాధి హామీ పథకంలో పెండింగ్ లో ఉన్న నాలుగు మాసాల బిల్లులను తక్షణమే చెల్లించి, కూలీలను ఆదుకోవాలన్నారు. అలాగే పథకంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు.

1
1381 views