
బూటకపు హామీలతో మోసం..కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను
జనంలోకి తీసుకెళ్లాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే
గొర్లె కిరణ్‌కుమార్
ఎచ్చెర్ల: కుటమి పార్టీలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగించాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ సమక్షంలో ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట సమీపంలో ఎచ్చెర్ల మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీ పరిచయ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.ఎచ్చెర్ల మండల పార్టీ అధ్యక్షుడు బోర సాయిరాంరెడ్డి, అజ్జరాం సర్పంచ్ స్రవంతి, మండల పార్టీ కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి ఉందన్నారు. ప్రజలను భయపెట్టి విధ్వంస పాలన ఎన్నాళ్లూ సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కార్యకర్తలకు ప్రాధాన్యమిస్తున్నారని, అందరి సూచనలు, సలహాలు తీసుకుంటారని, క్షేత్రస్థాయి పరిస్థితి వివరించవచ్చని చెప్పారు. రాష్ట్రంలో పాలన గాడితప్పిందన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు నిర్వీర్యమయ్యాయని చెప్పారు. రాష్ట్రమంటే అమరావతి కాదని, ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలపై ఒక్కసారైనా దృష్టిపెట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
సమష్టిగా పనిచేద్దాం..
మాజీ ఎమ్మెల్యే, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి గొర్లె కిరణ్‌కుమార్ మాట్లాడుతూ పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని, సమష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. 2014లో అధికారం కోల్పోయినా నిరాశ చెందకుండా 2019లో అధికారంలోకి వచ్చామని, రానున్న ఎన్నికల్లోనూ తప్పక విజయం సాధిస్తామన్నారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు, ప్రభుత్వ పథకాల్లో రాజకీయ జోక్యం, తప్పుడు కేసుల నమోదు వంటి వాటిపై ప్రజల్లో తీవ్ర వ్యక్తిరేకత వ్యక్తమవుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సనపల నారాయణరావు, ఎచ్చెర్ల, లావేరు, రణస్ధలం, జి.సిగడాం మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాంరెడ్డి, దన్నాన రాజినాయుడు, గొర్లె శ్రీనివాసరావు, డోల వెంకటరమణ, జెడ్పీటీసీలు మీసాల సీతంనాయుడు, కాయల వెంకటరమణ, నాయకులు, ప్రజా ప్రతినిధులు రొక్కం బాలకృష్ణ, ఎన్ని ధనుంజయ, మీసాల వెంకటరమణ, జరుగుళ్ల శంకరరావు, బల్లాడ జనార్దనరెడ్డి, బెండు రామారావు, కె.వి.వి.సత్యనారాయణ, మూగి శ్రీరాములు, అంబటి రాంబాబు, పంచిరెడ్డి రాంబాబు, తమ్మినాయుడుపేట నాయకులు సనపల సూరిబాబు, వావిలపల్లి వెంటరమణ, యండ రమేష్, గురుగుబెల్లి దివాకర్, గురుగుబెల్లి రామచంద్రరావు, పంచాది లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు.