
టోల్ రుసుములను తగ్గిస్తూ నిర్ణయం
ఐ-హబ్
*టోల్ రుసుములు తగ్గాయ్ - నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి*
*తగ్గిన టోల్ రుసుములు - నేటి అర్ధరాత్రి నుంచి హైదరాబాద్-విజయవాడ హైవేపై అమలులోకి రానున్న తగ్గిన రుసుములు - 2026 మార్చి 31 వరకు అమలులో ఉండనున్న తగ్గిన ధరలు*
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ఫీజును తగ్గిస్తూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ ఫీజులు మార్చి 31 అర్ధ రాత్రి నుంచి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ (65) జాతీయ రహదారిపై తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఏపీలో చిల్లకల్లు (నందిగామ) వద్ద మొత్తంగా 3 టోల్‌ప్లాజాలు ఉన్నాయి.
పంతంగి టోల్ ప్లాజా : అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, వ్యాన్‌లు, జీపులకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, ఇరువైపులా కలిపి రూ.30, తేలికపాటి కమర్షియల్ వాహనాలు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, బస్సు, ట్రక్కులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు.
టోల్ రుసుములో 25 శాతం రాయితీ : చిల్లకల్లు టోల్‌ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒక వైపునకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే అతి తక్కువగా తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25 శాతం రాయితీ లభించనుంది. 2026 మార్చి 31 వరకు అంటే ఏడాది పాటు తగ్గిన టోల్ ధరలు అమలులో ఉండనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంది.
ఎన్‌హెచ్‌ఏఐ అధీనంలోకి రావడంతో : యాదాద్రి జిల్లా దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లను జీఎమ్మార్ కాంట్రాక్ట్ సంస్థ రూ.1,740 కోట్లతో బీవోటీ పద్ధతిలో నాలుగు వరుసల రహదారిని నిర్మించింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మూడు టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబరులో టోల్ ఫీజు వసూళ్లు ప్రారంభమయ్యాయి. 2024 జూన్ 31 వరకు జీఎమ్మార్ సంస్థ టోల్ వసూళ్లు, రహదారి నిర్వహణను పర్యవేక్షించింది.
ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతున్నందునే : గతేడాది జులై 1 నుంచి టోల్ వసూళ్లను ఎన్‌హెచ్‌ఏఐ ఏజెన్సీల ద్వారా చేపట్టింది. జీఎమ్మార్ సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ రుసుములను పెంచుకునేందుకు ఈ ఒప్పందం ఉండేది. ఇప్పుడు స్వయంగా ఎన్‌హెచ్‌ఏఐ టోల్ వసూళ్లను చేపడుతున్నందున టోల్ రుసుములను తగ్గిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.