logo

* ఉగాది రోజున ఆచరించవలసిన విహిత కర్మలు*

ఉగాది రోజున ఆచరించవలసిన
విహిత కర్మలు

1.తైలాభ్యంగనం స్నానం,
2.నూతన సంవత్సరాది స్తోత్రం చదవాలి,
3.ఉగాది పచ్చడి సేవనం,
4.ధ్వజారోహణం,
5.పంచాంగ శ్రవణం
6.పెద్దలను గురువులను దర్శించాలి,
7.దైవదర్శనం చేయాలి,
8.గోపూజ, వృషభ పూజ చేయాలి.

*తైలాభ్యంగనస్నానం*

నువ్వులనూనెని ఒంటికి పట్టించి చేసే స్నానమే ఈ తైలాభ్యంగన స్నానం

*ఏదైవాన్నిపూజించాలి*

ఏ దైవాన్ని పూజించాలి అన్నది కూడా ఓ సందేహమే ! ఉగాది రోజున కాలమే దైవం. కాబట్టి మనకు ఇష్టదైవాన్ని ఆ కాలపురుషునిగా తల్చుకుని పూజించుకోవాలి.సృష్టికర్త విశ్వకర్మను ధ్యానించినా, స్థితికారుడైన విష్ణుమూర్తిని స్మరించినా , లయకారుడైన శివుని కొలిచినా , ప్రకృతికి చల్లధనాన్ని అందించే అమ్మవారిని ధ్యానించినా సమ్మతమే !

*ఉగాదిపచ్చడి*

పులుపు , తీపి , వగరు , చేదు , ఉప్పు , కారం అనే ఆరురుచుల కలయికగా ఉగాది పచ్చడిని రూపొందిస్తాము నింబసుమం అంటే వేపపూత, వేపపువ్వును మొదటిగా నీటిలో కలపాలి. వేపపువ్వు వేసిన నీటిలో కొత్త బెల్లం వేస్తారు. ఆ తరువాత చింతపండును కూడా వేసి చిక్కని పులుసు పదార్ధంగా ఆ ప్రసాదాన్ని తయారు చేస్తారు. అందులో కొంత ఆవునెయ్యి,మిరియాలు,యాలకులు, లవణం కలపాలి. మామిడి ముక్కలు,అరటి పండు ముక్కలు కూడా ఉగాదిపచ్చడిలో కలుపుకోవడం మన సంప్రదాయం. ఉగాది పచ్చడిని మొదట పరమేశ్వరుడికి నివేదించాలి...

*నూతనసంవత్సరాదిస్తోత్రం*

శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణమ్

వేపపూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్రసదృశమై , సర్వారిష్టాలూ తొలగిపోతాయనీ.... నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.

ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది...

అబ్దాదౌ నింబకుసుమం
శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌
భక్షితం పూర్వయామేస్యా
తద్వర్షం సౌఖ్యదాయకమ్‌॥

ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తింటే... రాబోయే సంవత్సరంలో అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం.

ఈ... స్తోత్రాలు చదువుకుని తొలి యామకాలం దాటకుండానే ఉగాదిపచ్చడి ప్రసాదం గా స్వీకరించాలి....

*ధ్వజారోహణం*

ఉగాది నాడు ప్రతి ఇంటి మీద కూడా విజయానికి గుర్తయిన ధ్వజారోహణము చేస్తారు. ధర్మ ధ్వజం అంటే కాషాయ రంగు పతాకం. ఈ 'జెండా'ను 'భగవత్ ధ్వజం' అని అంటారు. దేవాలయాల ధ్వజస్తంభాల మీద, గర్భాలయ గోపురాల మీద ఈ కాషాయ ధ్వజం అనాదిగా ఎగురుతోంది....

*ఉగాదిదానం*

దేవాలయ అర్చకులకు స్వయంపాకం
దక్షిణ తాంబూలం, ఇతరులకు గొడుగులు,మామిడిపళ్ళు, చల్లటి మంచినీరు, కొత్త వస్త్రాలు, విసనకర్రలు, మజ్జిగ వంటివి దానం చేసుకుంటే ఎంతో మంచిదని శాస్త్రవచనం.... అలాగే *ప్రపాదానం* అంటే చలివేంద్రాన్ని
పెట్టమన్నారు పెద్దలు. ఎండలు మొదలయ్యే ఈ సమయంలో చలివేంద్రంతో బాటసారుల దాహార్తిని తీర్చడమే వారి ఉద్దేశం. చలివేంద్రం స్థాపించే స్తోమత అందరికీ ఉండదు కాబట్టి ఒక నీటి కుండనైనా దానం చేయమని సూచిస్తారు.

*గోపూజ*

గోవుకి నమస్కరించి ప్రదక్షిణము చేసి గోగ్రాసము పెట్టి, వృషభపూజ చేసి వస్తే విశేషమైన ఫలితము కలుగుతుంది.

*పంచాంగశ్రవణం*

ఉగాది రోజున దేవాలయాలలో పంచాంగ శ్రవణం జరుగుతుంది. పంచాంగ శ్రవణం సర్వపాపహరం అని ప్రజల నమ్మకం...

*లలితాదేవినవరాత్రులు*

ఉగాది ,పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకు వసంత లలితా దేవి నవరాత్రులు అని పిలుస్తారు.

ఈ నవరాత్రులు ఎవరు ఉపవాస దీక్ష చేసి భగవదారాధన చేస్తారో వారి జోలికి అపమృత్యువు కానీ, రోగాలు కానీ, పీడలు కానీ దరి చేరవు అని శాస్త్ర వచనం...

మీకు, మీ కుటుంబ సభ్యులకు
విశ్వావసు నామసంవత్సర ( ఉగాది) శుభాకాంక్షలు,

0
0 views