logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రపంచ జల దినోత్సవం........

తేది: 21-03-2025 షేర్ లింగంపల్లి,చందానగర్:
ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ప్రపంచ జలదినోత్సవ అవగాహనపై ముద్రించిన గోడ పత్రికను హైదరాబాద్ మహానగర జలమండలి డివిజన్ నెంబర్ 15 జనరల్ మేనేజర్ శ్రీ ఎం. బ్రిజేష్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, " *ఐక్యరాజ్యసమితి వారు ప్రతి సంవత్సరం మార్చి 22ను ప్రపంచ జలదినోత్సవంగా ప్రకటించి, దీనిపై వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని ప్రధాన ఉద్దేశం ప్రకృతి ప్రసాదించిన నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు, భూగర్భ జలాలు కలుషితం కాకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి సంవత్సరం ఒక నినాదంతో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం _హిమనదాల సంరక్షణ_* " అని తెలిపారు. " *రోజురోజుకీ భూతాపం పెరిగిపోతుంది. దీనికి కారణం గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలతో పాటు, చెట్లను విరివిగా నరికి వేయడం, ప్లాస్టిక్ వినియోగం అధికమవడంతో పాటు పకృతి ప్రసాదించిన* *వనరులను విరివిగా వాడటం వలన, భూగర్భ జలాలు కలుషితం అవడం వల్ల పర్యావరణంలో పెను మార్పులు సంభవించి, మంచు కొండలన్నీ కరిగి సముద్ర జలాల్లో కలవడం, సముద్రమట్టం పెరగడంతో పాటు వరదలు, కరువులు, కొండ చరియలు విరిగిపడడం, దీనితో పర్యావరణ వ్యవస్థలు దెబ్బతింటున్నాయి"* అని అన్నారు. " *ప్రపంచ నాగరికత అంతా నదీ తీర పరీవాహక ప్రాంతాలలోనే ఇనుమడించింది"* అని అన్నారు. " *భూగోళంలో 97% ఉప్పునీరే. మిగతా మూడు శాతం నదులు, సరస్సులు మరియు మంచు పర్వతాలు, భూగర్భ జలాల ద్వారా నీరు లభిస్తుంది. కేవలం నదులు, సరస్సులు, భూగర్భ జలాల ద్వారా లభించే నీరు మాత్రమే త్రాగునీరు, సాగునీరు మరియు పారిశ్రామిక వినియోగానికి ఉపయోగ పడుతున్నాయి. సకల జీవకోటికి గాలి తర్వాత నీరే ప్రధానమైనది. చెరువుల ద్వారా 0.86 శాతం, నదుల ద్వారా 0.02 శాతం, భూగర్భ జలాల ద్వారా 0.12% మాత్రమే నీరు లభ్యమవుతున్నది. ఒక ప్రక్క జనాభా పెరిగిపోవడం మరియు భూగర్భ జలాలు రోజురోజుకీ అడుగంటడం పారిశ్రామిక అవసరాలు పెరగడంతో ప్రపంచంలో 80 దేశాలు త్రాగునీటి సమస్యతో కొట్టుమిట్టాడుతున్నాయి. మానవుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే త్రాగే నీరు, తినే ఆహారం మరియు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత ప్రధానమైనవి. లోయ ప్రాంతాలలో మరియు అటవీ ప్రాంతాలలో నివసించే ప్రజలు పరిశుభ్రమైన త్రాగునీరు లభించక అనేక వ్యాధులకు గురై సంవత్సరానికి ప్రపంచం మొత్తం మీద 40 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. ఇవి అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలోనే జరుగుతున్నాయి. మనకు పూర్వం నుంచి మనదేశంలో నీటి విలువ తెలుసు కాబట్టి నీటిని గంగమ్మ అని నదులు, చెరువులను, కాలువలను పూజలు పునస్కారాలతో గౌరవిస్తున్నాం. పరిస్థితులు ఇదేవిధంగా ఉంటే నీరు లేని భూమి మరుభూమికన్నా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికే మన గ్రామాల, జిల్లాల మరియు రాష్ట్రాల మధ్య వీటికొరకు ఘర్షణ వాతావరణం ఏర్పడింది. భవిష్యత్తులో నీటికోసం దేశాల మధ్య కూడా యుద్ధాలు జరిగే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మనదేశంలో ప్రతిరోజు ప్రతి వ్యక్తికి పట్టణ ప్రాంతంలో కనీసం 135 లీటర్లు నీరు అవసరం ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాలలో అయితే 100 లీటర్లు అవసరం ఉంటుంది.అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలలో ఒక రోజుకి 500 లీటర్లు నీటిని వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో అందరికీ పరిశుభ్రమైన త్రాగునీరు, సాగునీరు, ఇతర పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరు కావాలంటే, నీటికి పొదుపుగా వాడడం, వాడిన నీటిని తిరిగి వ్యవసాయానికి ఉపయోగించుకోవడంతో పాటు, వ్యర్థాలను భూమిలోకి ఇంకకుండా చేయాలి. అలాగే ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాలను పెంచుదాం. ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి ప్రతిఒక్కరు, నీటి సంరక్షణతో పాటు, ఇతర రసాయనిక పదార్థాలతో కలుషితం కాకుండా కాపాడుకోవడం వంటి చర్యలు చేపట్టాలి.ఇది కేవలం ప్రభుత్వమే కాకుండా పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఆచరిస్తే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడి సకల జనులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటార* " ని తెలిపారు. ఈ సందర్భంగా అందరి చేత నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీహరిబాబు, కౌండిన్యశ్రీ, నండూరి వెంకటేశ్వరరాజు, శివరామకృష్ణ, పాలెం శ్రీను, జనార్ధన్, బాలరాజు, సుధాకర్, యూసుఫ్, రామారావు, శివరామిరెడ్డి మరియు జలమండలి అధికారులు శ్రీయుతులు నరేందర్ రెడ్డి, శరత్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

97
5064 views