
రష్మిక అక్కడే బాగున్నారు
మన సినిమాలలో అనగా తెలుగు సినిమాలలో అతి చేయడం ఒక్కటే చేతనయిన పని. గ్లామర్ పరంగా అతి చేయడం.. స్కిన్ షో చేయడం.. స్కీన్ టోన్ ను చూపించి అతి చేయడం అన్నవి అతీ గతీ లేని వ్యవహారాలు. వీటి కారణంగా మన సినిమాలు మరింత అసహ్యంగా ఉన్నాయి. ఉంటాయి కూడా ! ఓ యోధుడి భార్య పాత్రలో రష్మిక ఒదిగిపోయారు. గ్లామర్ డాళ్ అన్న పదానికి ఇకపై అర్థం మార్చుకుని వెళ్లాలి. లేదా కొత్త అర్థం ఒకటి ఇచ్చి తీరాలి. మన జీవితాలలో ఆనందం దుఃఖంతో పాటే మరికొన్నివివరాలు సినిమాలు ప్రస్ఫుటితం చేస్తే వాటిలో మగువల ప్రాధాన్యం వారి జీవన విధానం, ప్రోత్సహించే నైజం అన్నవి ముఖ్యం. !
రాత్రి ఒక సినిమా చూసి వచ్చాను. ఛావా సినిమా చూసి వచ్చాను. వచ్చాక ఎందుకనో మళ్లీ మళ్లీ సినిమా చూసే కన్నా పోస్టర్ ను చూడాలని అనుకుంటున్నాను. పోస్టర్ లో రష్మిక గారు మరింత గ్లామర్ తో కూడి ఉన్నారు. అంటే గ్లామర్ .. అంటే ? మన భారతీయతకు అద్దం పట్టే విధంగా విదేశీ వ్యవహారాలకు (యవ్వారాలకు) దూరంగా ఉన్న ఓ స్త్రీ రూం లేదా ముగ్ధ మనోహర రూపం నా కలలకు సాకారం ఇచ్చే రూపం ఒకటి నా కళ్లెదుట ఉండడంతో నేనెంతో ఆనందించాను. !
మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆడవాళ్లు ఉండరు ఆడ విలన్లు ఉంటారు. మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఆడవాళ్లు ఉండరు అందాల బొమ్మలు ఉంటాయి. వాటికి కొమ్ములు ఉన్నా పనిచేయవు. వాటికి కోపం ఉన్నా అక్కర్లేదు. అంటే స్త్రీ అనే రూపం అత్యంత సుకుమారం అని సుకుమార్ సినిమాలను చూసి నేర్చుకోవచ్చు. ఆయన సృష్టించిన పాత్రల కారణంగా ఏ విధంగా చూసినా కోపం, ధిక్కరించే నైజం అన్నవి పెద్దగా నేను చూడను. చూడలేదు కూడా ! పీలింగ్సు పీలింగ్సు అని సీలింగ్సు అదిరిపోయాక నేను నవ్వుకుంటూ ఉన్నాను. వీటికి విరుద్ధంగా ఛావా సినిమాలో రష్మిక గారు పెద్ద బొట్టులో నాకెంతో ఇష్టం అయిన భారతీయ స్త్రీ కి ప్రతినిధిగా నిలిచిన వైనం ఎంతో బాగుంది.
కళ ఎలా ఉంటే బాగుంటుంది ? అంటే మనం చెప్పిన విధంగా వినే కళ ఒక్కటి చాలా బాగుంటుంది. మన అంటే మనసు చెప్పిన విధంగా ఉండే కళ బాగుంటుంది అని చదివేను. అంటే మాట్లాడే రేఖలు. మాటలు వినే రేఖలు.. అన్నవి తన పాలిట వరం అని సుప్రసిద్ధ చిత్రకారుడు చెప్పారు. ఆయన జీవితాన వివాదాలు ఉన్నా కూడా ఈ మాట భలే ఉంది. ఆత్మ ఒక చోట శరీరం ఒక చోట ఉండే లేదా ఉంచే కళ మంచిది కాదు అని కూడా చెప్పారాయన. చదివేన్నేను.
విమెన్ ఇన్ సినిమా అని అతి పెద్ద చర్చ ఒకటి నడుస్తుంది. నేనా నవ్వుకుంటాను. ఎందుకంటే విమెన్ ఇన్ లైఫ్ అన్నది ఎవ్వరూ లేదా ఎవ్వడూ రాయడు లేదా రాయరు అని కూడా అనుకుని బాధపడతాను. అంటే వాళ్ల కష్టాలను రాయమని. కన్నీరు పెట్టమని, సానుభూతి మరియు సహానుభూతి పొందమని చెప్పడం నాకొక బాధ్యత అని చెబుతున్నాను. ఇవేవీ లేకుండా నేను లేను. నేను రాయలేను. ఎందుకంటే వాటి కారణంగా నేను సాధించేది ఏమీ ఉండదు అన్నది నాకొక తెలిసిన వివరం. మీకు కూడా అర్థం కావాల్సిన లేదా అర్థం చేయాల్సిన వివరం. నిన్నటి రాత్రి (08.03.2025) ఛావా సినిమా చూశాను. బాగుంది. అన్నింటి కన్నా విక్కీ కౌశల్ కన్నా రష్మిక నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నారు. అంటే శంభాజీ భార్య పాత్రలో ఆమె ఒదిగిపోయారు అని అర్థం. సినిమాలో శ్రీ సఖి అనే ఉచ్ఛరించారు.
అసలు పేరు ఏంటన్నది ఓ వివరం అందడం లేదు. యశుబాయి అని ఒకరు ఎసుబాయి అని ఒకరు ఇలా ఏదో ఒకటి రాసి విసిరేస్తున్నారు. పేరు ఏంటన్నది ఇప్పుడు ప్రస్తావనలో ఉన్న చర్చ కాదు కానీ.. మన సినిమాలలో అంటే తెలుగు వారి సినిమాలలో కనిపించే ఓ గ్లామర్ ముఖం అక్కడ లేదు. పీలింగ్సు సీలింగ్సు లాంటి పనికిమాలిన పాటలు లేవు. లేనందుకు సంతోషం. మన సినిమాలు ఇంకా చాలా నేర్చుకోవాలి. చెప్పాను కదా ! మనకు సినిమాలు తీయడం కన్నా చిల్లర ఏరుకోవడం చాలా ఇష్టం అయిన పని అని ! ఆ పని ఇకపై కూడా చేయాలి. చేస్తారు. వీటికి విరుద్ధంగానే చరిత్ర ఏమన్నా కానీ ముస్లింలు హిందువుల మధ్య జరిగిన యుద్ధం ఏమన్నా కానీ స్వరాజ్య సిద్ధి అన్నది ఓ నినాదం కనుక గౌరవిద్దాం. రష్మిక గారిని అభినందిద్దాం. మార్నింగ్ రాగా అతివ తరఫున