
CM Chandrababu : మంచి ప్రభుత్వాన్ని మార్చేస్తే నష్టం !
ప్రభుత్వాలు ఐదేళ్లకు ఒకసారి మారిపోతుంటే అభివృద్ధికి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత మనం ఒక పునాది వేశాం. అది ఒక స్థాయికి చేరకముందే ప్రభుత్వం మారిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన విధ్వంస పాలనతో ఆ పునాదిని నేలమట్టం చేసింది. ఇప్పుడు మళ్లీ మనం సున్నా నుంచి మొదలు పెట్టాల్సి వస్తోంది. మన ప్రభుత్వానికి కొనసాగింపు ఉండి ఉంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చాలా ఎత్తున ఉండేది’ అని ఆయన అన్నారు. దావోస్ నుంచి గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం ఉండవల్లి చేరుకున్నారు. తనను కలవడానికి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇంటి వద్ద కొద్దిసేపు మాట్లాడారు. ‘ఈ రోజు ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను నేను కలిశాను. ప్రభుత్వాలకు కొనసాగింపు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధిలో ఎలా ఉన్నాయో... మారిపోతున్న చోట అభివృద్ధి ఎలా ఉందో పోల్చుతూ ఒక రిపోర్ట్ కార్డ్ తయారు చేయాలని నేను ఆమెను కోరాను. దీనివల్ల ప్రజలకు కూడా కొంత అవగాహన వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో మనం పదేళ్లు ఉండటం వల్ల మంచి ప్రగతి చూపించగలిగాం.