logo

ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి. జల వనరులు, ప్రాజెక్టుల అధ్యయనకారులు టి లక్ష్మీనారాయణ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి.
జల వనరులు, ప్రాజెక్టుల అధ్యయనకారులు
టి లక్ష్మీనారాయణ
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist-
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జల వనరుల ప్రాజెక్టుల అధ్యయనకారులు, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్ టి. లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ఈనెల 19వ తేదీన జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల ప్రాజెక్టులు - ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి అధ్యక్షత వహించారు. టి. లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల జాబితాలో కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలోని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలుగొండ, వెనుకబడిన ఉత్తరాంధ్రలోని వంశధార రెండవ దశ, తోటపల్లి బ్యారేజీ, వంశధార నాగవల్లి అనుసంధాన పథకం, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను కేటాయించి నిర్మాణం చేయుట ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాలు సాగుదలకు వస్తుందని, దీనికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కృషి చేయాలని కోరారు.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ప్రారంభించడం హర్షదాయకమన్నారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని 150 అడుగుల ఎత్తులో నిర్మించి, గరిష్ట స్థాయిలో నీటిని నింపినప్పుడే ప్రాజెక్ట్ నిర్దేశిత లక్ష్యాలు నెరవేరుతాయి అన్నారు.
ప్రస్తుతం వినియోగంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్వహణపై గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టి సారించకపోవడం వలన కాలువల వ్యవస్థ అద్వాన్న స్థితిలో చేరాయని, అవసరమైన నిధులు కేటాయించి వచ్చే వర్షాకాలం నాటికి మరమ్మత్తులు చేయాలని కోరారు. గోదావరి బనకచర్ల అనుసంధాన పథకంపై విస్తృత చర్చకు అవకాశమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, నిపుణులు, ఉద్యమకారులు, రాజకీయ, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని సూచించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణా జలాలపై సమర్థవంతంగా వాదనలు వినిపించడం ద్వారా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా సంక్రమించిన ఆంధ్రప్రదేశ్ నీటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉన్నదని గుర్తు చేశారు.
మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రసంగిస్తూ కాలేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు భారంగా మారిందని, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారంగా మారకూడదన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు లభించే చిన్న చిన్న ప్రాజెక్టులను సంపూర్ణంగా పూర్తి చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు.
జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ రుణభారంతో ఉన్న రాష్ట్రంలో గత ఏడు నెలల్లో 70 వేల కోట్లు అప్పు చేసి, ప్రతి నెలా 6 వేల కోట్లకు పైగా వడ్డీలు చెల్లిస్తున్న నేపథ్యంలో నదుల అనుసంధానం పేరుతో 90 వేల కోట్ల ఖర్చుతో గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలనుకోవడం సబబు కాదన్నారు. దీనికి బదులు 20వేల కోట్ల రూపాయలతో ఉత్తరాంధ్ర రాయలసీమలో కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో 1,13,000 చెరువులు ఉన్నాయని, వేలాది కిలోమీటర్ల నీటి కాలువలు ఉన్నాయని, వీటిలో పూడిక తీసి నీటి నిల్వలను పెంచగలిగితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించగలమన్నారు.
ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిసర్ల కృష్ణమూర్తి నాయుడు ప్రసంగిస్తూ ఉత్తరాంధ్రలో 27,000 చెరువులు ఉన్నాయని, వీటిలో వందలాది చెరువులు ఆక్రమణలకు గురైనాయని, గత నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభించిన నీటిపారుదల ప్రాజెక్టులు ఇంకా పూర్తి కాలేదన్నారు. ఉత్తరాంధ్ర వలసలకు వేదికగా మారిందని, కేవలం 3000 కోట్లు ఖర్చు చేస్తే ఉత్తరాంధ్రలో నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయన్నారు.
ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు వై. కేశవరావు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో గత ఐదు సంవత్సరాల కాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల కేటాయింపులలో 52% మాత్రమే ఖర్చు చేసినారని, నేటి ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల కేటాయించిన ఒక్క కోటి కూడా విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తులు పెరిగి, సంపద సృష్టి జరిగి ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయన్నారు.
ఈ చర్చా గోస్టిలో ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రహ్మణ్యం, ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు, హైకోర్టు అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు ఏవి పటేల్, నేస్తం సహ వ్యవస్థాపకులు టి. ధనుంజయ రెడ్డి, వంశధార సాధన సమితి ప్రెసిడెంట్ ఎస్వీవీ ప్రసాద రావు తదితరులు ప్రసంగించారు.

1
1553 views