logo

డిజిటల్ అరెస్టు పట్ల అవగాహనకు రూపొందించిన లఘు చిత్రం ఆవిష్కరణ - విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్



డిజిటల్ అరెస్టు పట్ల ప్రజలను జాగృతం చేసి, వారిలో అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు
టూల్స్ వినియోగించి ప్రత్యేకంగా రూపొందించిన లఘు చిత్రంను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 7న పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - డిజిటల్ అరెస్టు పేరుతో సైబరు మోసగాళ్ళు కాల్స్, లింక్స్ మరియు వీడియో కాల్స్ తో ప్రజలకు ఉచ్చు వేస్తూ, వారిని భయపెట్టి, వారి నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. సైబరు నేరగాళ్ళు ముందుగా ఫోను చేసి వ్యక్తిగత సమాచారం, చిరునామా, ఆధార్ నంబరు, ఫోను నంబరు వంటి వివరాలను తెలిపి, దూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులు లేదా పిల్లలు పోలీసు కేసులో ఇరుక్కున్నారని లేదా కొరియర్ చేసిన ప్యాకింగులో మాదక ద్రవ్యాలను విదేశాలకు పంపుతున్నట్లుగా నిర్ధారణ అయ్యిందని లేదా ఫేక్ పాస్పోర్టులు, బంగారం బిస్కెట్లు ఉన్నాయని, మనీ ల్యాండరింగుకు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు, కేసు కూడా నమోదు చేసినట్లు, విచారణ నిమిత్తం తాము సూచించిన ప్రాంతానికి దర్యాప్తు నిమిత్తం రావాల్సి ఉంటుందన్న సమాచారం అందించి భయభ్రాంతులకు గురి చేస్తారన్నారు. అంతేకాకుండా, సదరు మోసగాళ్ళు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ లేదా టాస్క్ ఫోర్స్ లేదా పోలీసు అధికారులతో మాట్లాడాలని తెలిపి, వేరే వ్యక్తులకు ఫోను కనెక్ట్ చేస్తారన్నారు. తదుపరి సైబరు మోసగాళ్ళు తమను ఒక పోలీసు అధికారిగా లేదా సిబిఐ అధికారిగా లేదా ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకొంటూ, తన గుర్తింపు కార్డుగా నకిలీ ఐడి కార్డును చూపుతారన్నారు. నమోదైన కేసులో దర్యాప్తు నిమిత్తం తమ వద్దకు రావాల్సి ఉంటుందని భయపెడతారన్నారు. తాము రాలేని పరిస్థితుల్లో ఉన్నామని చెబితే, ఆన్లైనులో కూడా
దర్యాప్తుకు హాజరుకావచ్చునని, తమకు ఒక లింకు పంపుతున్నామని, వాటిపై క్లిక్ చేసి, స్కైప్లో దర్యాప్తుకు హాజరవ్వాలని
సూచిస్తారన్నారు. సైబరు మోసగాళ్ళ పంపిన లింకును క్లిక్ చేస్తే, తమ బ్యాంకు సేవింగు ఖాతాల్లోని నగదు చోరీకి గురవుతుందన్నారు. కొన్నిసార్లు తమతో మాట్లాడిన వివరాలను ఎవ్వరికీ తెలపకుండా గోప్యంగా వుంచాలని, తమపై నమోదైన
కేసులో సహాయం చేస్తామని, చర్యలు నిలిపేస్తామని నమ్మించి, తాము సూచించిన బ్యాంకు ఖాతాకు భారీగా నగదు పంపాలని కోరుతారన్నారు. తమ బ్యాంకు ఖాతాను రిజర్వు బ్యాంకు సహకారంతో పరిశీలించాల్సి ఉందని, వివరాలు
సేకరించి, ఖాతాలో డబ్బును కాజేస్తారన్నారన్నారు. ఫోన్లో వాట్సాప్, స్కైప్ వంటి యాప్ల ద్వారా వీడియోకాల్స్ చేసి
సిబిఐ, కస్టమ్స్ మరియు పోలీసు అధికారిగా నమ్మించి, నకిలీ పత్రాలతో బెదిరించి, జైలు పేరు చెప్పి ప్రజల్ని భయపెట్టి అందినంత సొమ్మును తమ ఖాతాలకు జమ చేసుకుంటారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఇటువంటి సైబరు మోసగాళ్ళ పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. దర్యాప్తులో డిజిటల్ అరెస్టు అన్నదే లేదన్నారు. ఈ తరహా కాల్స్ ఎవరికైనా వస్తే అప్రమత్తంగా వ్యవహరించాలని, స్థానిక పోలీసు స్టేషను లేదా 1930కు లేదా https://cybercrime.gov.in ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజలకు డిజిటల్ అరెస్టు పట్ల అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు టూల్స్ ను వినియోగించి ఏనిమేషనుతో పాత్రలను సృష్టించి, షార్టు ఫిల్మ్ ను రూపొందించి, సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ద్వారా ప్రజలకు చేరువ చేయనున్నామని జిల్లా ఎస్పీ అన్నారు.
షార్టు ఫిల్మ్ ను రూపొందించుటలో క్రియాశీలకంగా పని చేసిన సోషల్ మీడియా సెల్ కానిస్టేబులు బి.రాంబాబును జిల్లా
ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రంను ప్రధానం చేసారు.
ఈ షార్టు ఫిల్మ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, కానిస్టేబులు బి.రాంబాబు పాల్గొన్నారు.

0
135 views